Tripuraneni Gopichand: ఆయన ఎవ్వరినీ నొప్పించేవారు కాదు..

21 May, 2021 16:27 IST|Sakshi

త్రిపురనేని గోపీచంద్‌.. లక్ష్మమ్మ, పేరంటాలు, ప్రియురాలు చిత్రాలకు దర్శకత్వం వహించారు... పలు చిత్రాలకు సంభాషణలు రచించారు.. అసమర్థుని జీవయాత్ర, పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా... వంటి నవలల ద్వారా సాహితీ లోకానికి సుపరిచితులు... త్రిపురనేని రామస్వామి కుమారుడిగా కాకుండా... త్రిపురనేని గోపీచంద్‌గా  ప్రసిద్ధులయ్యారు.. తండ్రిగా పిల్లలతో ఎలా ఉండేవారో వారి రెండో కుమార్తె రజని సాక్షికి వివరించారు..

నాన్నగారు 1910, సెప్టెంబరు 8 వినాయక చవితి రోజున చౌటుపల్లిలో పుట్టారు. త్రిపురనేని రామస్వామి, పున్నమాంబలు తల్లిదండ్రులు. నాన్నగారికి ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. తాతగారు విప్లవ రచయిత, నాన్నగారు అభ్యుదయ రచయిత. ఇంకా చెప్పాలంటే నాన్నగారి రచనలలో మనోవిశ్లేషణ ఎక్కువగా ఉంటుంది. నాన్నగారి 22వ ఏట శకుంతలాదేవితో వివాహమైంది. అమ్మ ఉన్నవ లక్ష్మీ నారాయణ పంతులు గారి ‘శారదా నికేతనం’లో.. తెలుగులో విద్వాన్‌ , హిందీలో విశారద చదువుకున్నారు. అమ్మను బాగా చదువుకున్నవారికి ఇవ్వాలనుకున్నారు. అందువల్ల నాన్నగారి చదువు చూసి వివాహం నిశ్చయించారు. నాన్నగారు చాలా ఇష్టపడి ఈ వివాహం చేసుకున్నారు. ఇద్దరిదీ ఇంటలెక్చువల్‌ కంపానియన్‌ షిప్‌.

అనుకూలమైన దాంపత్యం. నాన్నగారు అమ్మకు ఇంగ్లీషు పాఠాలు చెప్పారు. అమ్మనాన్నలకు మేం ఆరుగురం పిల్లలం. ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు. ప్రమీలా దేవి, రమేశ్‌బాబు, రజని (నేను), రామ్‌గోపాల్, నళిని, సాయిచంద్‌ (సినిమా నటుడు). మా చదువుల గురించి బాగా శ్రద్ధ తీసుకున్నారు. పెద్ద అన్నయ్య రమేశ్‌ డాక్టరు చదివాడు. ఇంగ్లండ్‌ కూడా వెళ్లాడు. నాన్నగారు పోయేనాటికి మా చిన్నతమ్ముడు సాయి చంద్‌ వయస్సు ఆరు సంవత్సరాలు. వాడిని చూస్తుంటే, తన బాల్యం గుర్తుకు వస్తోందనేవారు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో కానీ, మా ఇంట్లో సాయి ఒక్కడే నాన్నగారి సినిమా వారసత్వం అందుకున్నాడు. 

సినిమాలు – ఆకాశవాణి
నాన్నగారు గూడవల్లి రామబ్రహ్మం గారి ఆహ్వానం మీద మద్రాసు వెళ్లి, రైతుబిడ్డ చిత్రానికి రచయిత, సహకార దర్శకుడిగా పనిచేశారు. మాయాలోకం, చిత్రానికి కూడా వారి దగ్గరే రచయితగా పనిచేశారు. ఆ తరవాత వచ్చిన గృహప్రవేశం చిత్రానికి కథమాటలుస్క్రీన్‌ప్లే సమకూర్చారు. ఆ రోజుల్లో ఆ చిత్రం కొత్త తరహాలో రూపొందింది. లక్ష్మమ్మ, పేరంటాలు, ప్రియురాలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. జగ్గయ్యగారిని ప్రియురాలు చిత్రంలో హీరోగా పరిచయం చేశారు. ఆ తరవాత పి.పుల్లయ్యగారు, కె. వి. రెడ్డిగారు నాన్నగారు కలిసి ధర్మదేవత చిత్రానికి స్క్రీన్‌ప్లే చేశారు. అది పెద్ద హిట్‌. అక్కడ సినిమాలకు పనిచేస్తున్న రోజుల్లోనే బెజవాడ గోపాలరెడ్డిగారి ఆహ్వానం మీద ‘సినిమాలు వదిలేసి, ఆంధ్ర రాజధానిగా కొత్తగా ఏర్పడిన కర్నూలుకి ఇన్‌ఫర్మేషన్‌ డైరెక్టర్‌గా వచ్చారు. అక్కడి నుంచి హైదరాబాద్‌ వచ్చాక, ఆలిండియా రేడియోలో గ్రామస్థుల కార్యక్రమం నిర్వహించారు. అదే సమయంలో ‘కలిమి లేములు’, దుక్కిపాటి మధుసూదనరావు గారి చదువుకున్న అమ్మాయిలు చిత్రాలకు... సంభాషణలు రాశారు. 

మల్లెపువ్వులా ఉండేవారు..
ఉదయం నాలుగు గంటలకు లేచి, కాఫీ తాగేసి, తన పనిలో నిమగ్నమైపోయే వారు. ఎంత పనిలో ఉన్నా కుటుంబాన్ని మాత్రం నిర్లక్ష్యం చేసేవారు కాదు. తెల్లటి పట్టు పంచె, లాల్చీలో నాన్న గారు మల్లెపువ్వులా ఉండేవారు. కర్నూలులో ఉన్న రోజుల్లో షేర్వాణీ వేసుకునేవారు. అప్పుడప్పుడు ప్యాంట్‌ షర్ట్‌ వేసుకునేవారు. వస్త్ర ధారణ విషయంలో శ్రద్ధ ఉండేది. ఎక్కడకు వెళ్లినా అమ్మకు, అక్కకు మైసూర్‌ క్రేప్‌ సిల్క్‌ చీరలు తెచ్చేవారు. మేం వేసుకున్న దుస్తులు గమనించేవారు. ఒకసారి అమ్మ మాటల మధ్యలో నాన్నగారితో నా గురించి, ‘రజనికి మీ అందం రాలేదు’ అంది. అందుకు, ‘దానికి జుట్టు, పాదాలు నావే వచ్చాయి కదా’ అన్నారు, ఎంతో ఆప్యాయంగా నా వైపు చూస్తూ. ఆయనకు ఎవ్వరి మనసు నొప్పించటం ఇష్టం ఉండదు.

మాతో సన్నిహితంగా...
ఎప్పుడైనా మేం ఆడుకుంటే పడిపోతే ఆయనకు నచ్చేది కాదు. చిన్న దెబ్బ వేసి, ‘ఎందుకు పడిపోతూ దెబ్బలు తగిలించుకుంటారు’ అని సున్నితంగా మందలించేవారు. ఆయన మాటల్లో ఎంతో తాత్త్వికత ఉండేది. నాన్నగారితో క్యారమ్‌ బోర్డు ఆడటం మాకు సరదాగా ఉండేది. నాన్నగారి స్ట్రయికింగ్‌ చూడాలనిపించేది. ఆడుకునేటప్పుడు తగవులు, అల్లరిచిల్లరిగా కొట్టుకోవటం తెలీదు. వాకింగ్‌ చేస్తూ, మా వయసుకి తగ్గట్టుగా కథలు, మాటలు చెప్పేవారు. అప్పుడప్పుడు షాపింగ్‌కి తీసుకువెళ్లేవారు. రాత్రి పూట భోజనాలయ్యాక కాసేపు బయటికి తీసుకువెళ్లి నడిపిస్తూ.. పల్లీలు, పండ్లు కొనేవారు. నాన్నగారి మీద ఆత్మీయతతో కూడిన గౌరవం ఉండేది. మాతో ఎంతో ప్రేమగా ఉండేవారు. 

శాకాహారులే...
తాతగారు శాకాహారులు కావటం వల్ల ఇంట్లో అందరూ శాకాహారమే తినేవారు. నాన్నగారు కొన్నాళ్లు మాంసాహారం తినేవారు. సాయిబాబా భక్తులయ్యాక వెజిటేరియన్‌ అయిపోయారు. అమ్మ శారదా నికేతనంలో పెరగటం వల్ల ఇంట్లో వంటకాలన్నీ ఇంగువ వాసన వచ్చేవి. చేకోడీలు, మురుకులు వంటివి అమ్మ చాలా బాగా చేసేది. నాన్న తిండి ప్రియులే కానీ, మితంగా తినేవారు. ఒక్కోసారి చేతిలో ఉన్న టిఫిన్‌ నోటి దాకా కూడా వెళ్లేది కాదు.

పెన్నులో నీళ్ళు పొయ్యమనేవారు
ఒకరోజున ఒక సంఘటన జరిగింది. ఆ జ్ఞాపకం ఇప్పటికీ మా హృదయంలో తడి ఆరకుండానే ఉంది. చేతితో పెన్ను పట్టుకుని, వంటగదిలోకి వచ్చి, ‘అమ్మా! ఈ పెన్నులో నీళ్లు పొయ్యి’ అన్నారు. ‘నీళ్లా’ అని నవ్వుతుంటే, ‘చాల్లే, ఇంకు ఇవ్వు!’ అన్నారు. నిరంతరం ఏదో ఒకటి రాసుకుంటూ ఉండేవారు. నాన్నగారు రాస్తున్నప్పుడే చదివేస్తూ ఉండేదాన్ని. మేం కొత్త పెన్ను కొనుక్కుని నాన్నగారికి ఇచ్చేవాళ్లం. ఆయన రోజంతా రాసుకుని పాళీ బాగా స్మూత్‌ అయ్యాక మాకు ఇచ్చేవారు. అప్పుడు ఆ పెన్ను మేం వాడేవాళ్లం. ఇల్లు నిరంతరం కళాకారులు, రచయితలతో సరస్వతీ పీఠంలా ఉండేది. అతిథి మర్యాదలు ఘనంగా జరుగుతుండేవి.  

మృదుహృదయ సంస్కారం..
ఉద్యోగరీత్యా మేం కర్నూలులో ఉంటున్న రోజుల్లో జరిగిన సంఘటన ఇప్పటికీ మేం మర్చిపోలేం. మా పొరుగు వాళ్లింట్లో ఒక పెద్దాయన గతించారు. ఆయన భౌతిక కాయాన్ని ఇంటికి తీసుకురావటానికి ఇంటివారు ఒప్పుకోకపోతే, నాన్నగారు ‘మా ఇంటికి తీసుకువచ్చి కార్యక్రమం చేసుకోండి’ అన్నారు. చైనా యుద్ధం జరుగుతున్న సమయంలో నాన్నగారు ఒక నెల జీతం విరాళంగా ఇచ్చేశారు. రావూరి భరద్వాజ నాన్నగారిని ‘అన్నదాత’ అన్నారు. ఆయనకు ఆకాశవాణిలో ఉద్యోగం నాన్నగారే వేయించారు. ఆయనకు ఆ కృతజ్ఞత ఉండిపోయింది.

అరుదైన గౌరవం..
తెలుగు సాహిత్య చరిత్రలో నాన్నగారు అందుకున్న అరుదైన గౌరవం ఒకటి ఉంది. నాన్నగారు రాసిన ‘పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా’ నవలకు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది. ఒక తెలుగు నవలకు ఈ అవార్డు దక్కటం అదే మొదలు. అలాగే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు తెలుగు వారి స్టాంపులు విడుదల కావటం కూడా విశేషమే. తాతగారిది, నాన్నగారిది... ఇద్దరివీ విడుదల చేశారు. రచయిత విహారి, నాన్నగారి నవలల గురించి, ‘సాధారణంగా కనిపించే అసాధారణ జ్ఞాన గంగ’ అన్నారు. 

బాధపడేవారు...
అమ్మ నాన్నగారితో సమానంగా సాహితీవేత్త. అమ్మ పరిజ్ఞానమంతా నిరుపయోగం అయిపోతున్నందుకు నాన్న గారు బాధపడినట్లు ఒకచోట రాసుకున్నారు. నాన్నగారు బిఏబియల్‌ చదివారు. తాతగారు కూడా లా చదివారు. ఇద్దరూ న్యాయవాద వృత్తిలోకి వెళ్లలేదు. తాతగారు 56 సంవత్సరాలకే గతించారు. తాతగారి సాహితీ వారసత్వంతో పాటు జీవన వారసత్వం కూడా వచ్చిందేమో!! నాన్నగారు 52 సంవత్సరాలకే మమ్మల్ని విడిచి వెళ్లిపోయారు.

ఆయనకు తెలుసేమో...
నాన్నగారు పోవటానికి ముందు రోజు అంటే నవంబరు 1న ‘భార్యా విలాపం’ నవల మొదలు పెడతానన్నారు. మరుసటి రోజు అంటే నవంబరు 2 న రమేశ్‌ అన్నయ్య మందులు తీసుకుని వచ్చాడు. అప్పుడు నాన్నగారు చేత్తో ఛాతీ మీద రాసుకుంటున్నారు. సరిగ్గా అప్పుడే డాక్టర్‌ వచ్చి ఇంజక్షన్‌ ఇస్తున్నారు. నాన్నగారికి ఏదో తెలిసినట్లుగా, ‘ఈ మధ్యనే మా స్నేహితుడు కృష్ణారావు ఇంజక్షన్‌ ఇవ్వగానే పోయారు’ అన్నారు.నాన్నగారి మాటలు వింటూనే, డాక్టర్‌గారు నాన్నగారికి ఇంజక్షన్‌ ఇచ్చారు. అదేం చిత్రమో తెలియదు కానీ, ఇంజక్షన్‌ చేసిన ఐదు నిమిషాలకే నాన్న కన్ను మూశారు. అమ్మ ఒంటరిగా విలపించింది. నాన్నగారి మీద బెంగ పెట్టుకుని, ఆయన పోయిన నాలుగు సంవత్సరాలకే అమ్మ కూడా తనువు చాలించింది.

మేం కర్నూలులో ఉండగా ఒక జ్యోతిష్కుడు వచ్చి నాన్నగారితో ‘మీకు ఆయుష్షు తక్కువ. మీ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది’ అని చెప్పారు. ఆ రోజు వరకు జరిగిన సంఘటనలన్నీ యాదృచ్చికమే కావొచ్చు. కాని నాన్నగారి విషయంలో అన్నీ వాస్తవం అయ్యాయి. అందువల్లే ఈ విషయాలు మాకు పదేపదే గుర్తుకు వస్తుంటాయి. మా జీవితాలు ప్రారంభిస్తున్న రోజుల్లోనే అంత గొప్ప తండ్రిని పోగొట్టుకున్నామన్న బాధ ఇప్పటికీ మా మనసులను వెంటాడుతూనే ఉంది. ఇప్పటివరకు మమ్మల్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నది నాన్నగారి సాహిత్యమే. ఏ సమస్య వచ్చినా నాన్నగారి పుస్తకాలే మాకు పరిష్కారం చూపిస్తున్నాయి. ఆయనకు పిల్లలుగా పుట్టడం మా అదృష్టంగా భావిస్తాం. 

గోపీచంద్రుడు అనేవారు...
విశ్వనాథ సత్యనారాయణ గారికి నాన్నగారి మీద పుత్ర వాత్సల్యం ఉండేది. ఎంతో ప్రేమగా ‘గోపీచంద్రుడు’ అని పిలిచేవారు. నాన్నగారు పోయినప్పుడు,  ‘అతని అకాల మరణమునకు నేను పొందుచున్న దుఃఖమునకు చిహ్నముగా’ అని ఆయన రచించిన ‘గంగూలీ ప్రేమకథ’ నవలను నాన్నగారికి అంకితం చేశారు. నాన్నగారు పోయేటప్పటికి... యమపాశం, చీకటి గదులు, ప్రేమోపహతులు.. మూడు రచనలు అసంపూర్ణంగా ఉండిపోయాయి. అవి అసంపూర్ణంగానే ముద్రితమయ్యాయి.

మరిన్ని వార్తలు