నేను జీవించినంత కాలం గిల్టీ ఫిలింగ్‌ అనుభవిస్తా.. నన్ను క్షమించు పావని

3 Aug, 2021 18:55 IST|Sakshi

తమిళ బిగ్‌బాస్‌ ఫేం, నటి యాషిక ఆనంద్‌ గత నెలలో రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంతో ఆమె స్నేహితురాలు పావని అక్కడికక్కడే మృతి చెందారు. యాషికకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స తీసుకొని యాషిక ఇటీవల కోలుకున్నారు. అయితే తాజాగా యాషిక.. తన స్నేహితురాలకు సంబంధించి ఓ ఎమోషనల్‌ నోట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆమె పోస్టులు సోషల్‌ మీడియోలో వైరల్‌గా మారాయి.

‘‘ప్రస్తుతం నేను ఎలా ఉన్నానో కూడా చెప్పలేకపోతున్నాను. నేను జీవించి ఉన్నంత కాలం ప్రమాదానికి సంబంధించి గిల్టీ ఫిలింగ్‌ను అనుభవిస్తాను. ఆ విషాదం నుంచి నన్ను కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలా లేదా ప్రాణ స్నేహితురాలిని నా నుంచి పూర్తిగా దూరం చేసిన దేవుడిని నిందించాలా అర్ధం కావటం లేదు. ప్రతి క్షణం పావనిని మిస్ అవుతున్నాను. ఆమె నన్ను ఎప్పటికీ క్షమించదని తెలుసు. నన్ను క్షమించు పావని.. నీ కుటుంబాన్ని విషాదకరమైన పరిస్థితిలోకి నెట్టినందుకు తీవ్రంగా బాధపడుతున్నాను. ప్రతి క్షణం నిన్ను కోల్పోతున్నా.. బతికి ఉన్నంతకాలం దోషిగా బాధపడతాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఏదో ఒకరోజు పావని కుటుంబం నన్ను క్షమిస్తుందని ఆశిస్తున్నాను. ఆమెతో ఉన్న జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేను’’ అని యాషిక భావోద్వేగంతో రాశారు.

బుధవారం యాషిక ఆనంద్‌ 22వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. అయితే తన బర్త్‌ డే వేడకలను అభిమానులు ఎవరూ చేయవద్దని కోరారు. ‘నేను బర్త్‌ డే వేడకలు చేసుకోవటం లేదు. అభిమానులు కూడా నా బర్త్‌ డే వేడుకలు నిర్వహించవద్దు.. పావని కుటుంబ సభ్యులకు శక్తినివ్వాలని దేవుడిని ప్రార్థించండి. పావని దూరమవ్వటం.. నా జీవితంలో పూడ్చలేని లోటు. మిస్‌ యూ పావని’ అని ఇన్‌స్టాగ్రామ్‌​ స్టోరీలో యాషిక పోస్ట్‌ చేశారు.

A post shared by Y A S H ⭐️🌛🧿 (@yashikaaannand)

మరిన్ని వార్తలు