Yashoda Review In Telugu: ‘యశోద’ మూవీ రివ్యూ

11 Nov, 2022 12:33 IST|Sakshi
Rating:  

టైటిల్‌: యశోద
నటీనటులు: సమంత,వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్‌ తదితరులు
నిర్మాణ సంస్థలు:  శ్రీదేవి మూవీస్
నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్
దర్శకత్వం: హరి-హరీష్‌
సంగీతం:మణిశర్మ
సినిమాటోగ్రఫర్‌:ఎం. సుకుమార్
ఎడిటర్‌: మార్తాండ్ కె. వెంకటేష్
విడుదల తేది: నవంబర్‌ 11, 2022

‘యశోద’ కథేంటంటే..
ఈ సినిమాలో రెండు కథలు సమాంతరంగా నడుస్తుంటాయి. ఒకవైపు ఇండియాకు వచ్చిన హాలీవుడ్‌ నటి ఒలివియా అనుమానస్పదంగా చనిపోతుంది. అలాగే టాప్‌ మోడల్‌ ఆరూషి, ప్రముఖ వ్యాపారవేత్త శివరెడ్డి కారుప్రమాదంలో మరణిస్తారు. ఈ కేసు దర్యాప్తు కోసం మిలటరీ ఆఫీసర్‌ వాసుదేవ్‌(సంపత్‌) టీమ్‌ రంగంలోకి దిగుతుంది. మరోవైపు పేదింటికి చెందిన యశోద(సమంత) తన చెల్లి ఆపరేషన్‌ కోసం సరోగసీ(అద్దెగర్భం)ని ఎంచుకుంటుంది.

ఆమె కడుపున పుట్టబోయే బిడ్డ కోటీశ్వరుల ఇంటికి వెళ్తుందని..ఆమెను ఆరోగ్యంగా ఉంచేందుకు  సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్‌ ‘ఈవా’కి తరలిస్తారు. అక్కడ అందరూ అద్దెగర్భం దాల్చిన వాళ్లే ఉంటారు. వీరి బాగోగులను చూసుకునేందుకు మధు(వరలక్ష్మీ శరత్‌కుమార్‌), డాక్టర్‌ గౌతమ్‌(ఉన్ని ముకుందన్‌) ఉంటారు. యశోద ‘ఈవా’కి వెళ్లిన తర్వాత అక్కడ ఏం జరిగింది? అనుమానస్పదంగా మరణించిన హాలీవుడ్‌ నటి ఓలివియాకి, ఈ సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్‌కు ఏదైన సంబంధం ఉందా? మోడల్‌ ఆరూషి నిజంగానే కారుప్రమాదంలో మరణించిందా?లేదా ఎవరైనా హత్య చేశారా? ప్రపంచంలో ధనవంతులైన మహిళలు రహస్యంగా ఇండియా ఎందుకు వస్తున్నారు? ఈ కథలో కేంద్రమంత్రి గిరిధర్‌ పాత్ర ఏంటి? అసలు యశోద నేపథ్యం ఏంటి అనేది థియేటర్స్‌లో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉందంటే.. 
'యశోద' ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ. వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకద్వయం హరి, హరీష్‌ ఈ కథను రాసుకున్నారు. కాన్సెప్ట్‌ కొత్తగా  ఉంటుంది. ట్విస్టులు ఉంటాయి. ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, యాక్షన్‌..అన్ని ఉంటాయి. కానీ ఎక్కడో ఏదో మిస్‌ అయిందనే ఫీలింగ్‌ కలుగుతుంది. థ్రిల్లింగ్‌ సీన్స్‌ని ప్రేక్షకుడు ఆస్వాదించలోపే.. లాజిక్‌ లేని సన్నివేశాలు చిరాకు కలిగిస్తాయి. ఈవాలో యశోద చేసే పనులు విలన్‌ గ్యాంగ్‌కు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ.. చూసి చూడనట్లు వదిలేయడం. సీసీ కెమెరాలు, సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఆమె ఈజీగా బయటకు వెళ్లడం.. ఇలా చాలా సీన్లలో లాజిక్‌ ఉండదు.

ఒక థ్రిల్లింగ్‌ సీన్‌ తర్వాత మరో ఎమోషనల్‌ సీన్‌ అన్నట్లుగా ఫస్టాఫ్‌ సాగదీతగా సాగుతుంది. ప్రీఇంటర్వెల్‌ నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. ఇక సెకండాఫ్‌ నుంచి వచ్చే ప్రతి సీన్‌ కొత్తగా ఉంటూ ఉత్కంఠ కలిగిస్తాయి. యశోద నేపథ్యం గురించి చెప్పే సీన్స్‌  ‘పోకిరి’తరహాలో ఉంటాయి. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ బ్యాక్‌స్టోరీ కూడా అంతగా ఆకట్టుకోదు. దానిని మరింత డెప్త్‌గా డిజైన్‌ చేస్తే బాగుండేదేమో. క్లైమాక్స్‌ కూడా రొటీన్‌గా ఉంటుంది. సమంత ఫ్యాన్స్‌కు నచ్చే అంశాలు ఈ చిత్రంలో చాలా ఉన్నాయి. 

ఎవరెలా చేశారంటే.. 
ఈ సినిమాకు ప్రధాన బలం సమంతనే. యశోద పాత్రలో నటించడం కంటే జీవించేసిందని చెప్పొచ్చు.  యాక్షన్‌ సీన్స్‌లో అదరగొట్టేసింది. ఈ సినిమా కోసం సమంత పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. ఇక సమంత తర్వాత బాగా పండిన పాత్రలు వరలక్ష్మీ శరత్‌కుమార్‌, ఉన్నికృష్ణలది. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న మధు, డాక్టర్‌ గౌతమ్‌ పాత్రల్లో ఇద్దరూ పరకాయ ప్రవేశం చేశారు. పోలీసు అధికారిగా శత్రు, మిలటరీ ఆఫీసర్‌ వాసుదేవ్‌గా సంపత్‌ చక్కటి నటనను కనబరిచారు. కేంద్రమంత్రి గిరిధర్‌ పాత్రకి రావురమేశ​ న్యాయం చేశాడు. కలికా గణేశ్‌, దివ్యలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం మణిశర్మ సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. ఆర్ట్ వర్క్‌, సినిమాటోగ్రఫీ  బాగుంది. పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి మాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. పంచ్‌ కోసం కాకుండా కథలో భావాన్ని తెలియజేసేలా డైలాగ్స్‌ ఉంటాయి. యాక్షన్‌ సీక్వెన్స్‌ చాలా బాగున్నాయి. ఎడిటర్‌ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి. 

-అంజిశెట్టి, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2.75/5)
Poll
Loading...
మరిన్ని వార్తలు