ఒక్కటి గుర్తు పెట్టుకోండి!

10 Oct, 2023 00:26 IST|Sakshi
జీవా, మమ్ముట్టి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో దర్శకుడు మహి వి.రాఘవ్‌ తెరకెక్కించిన చిత్రం ‘యాత్ర’. వైఎస్‌ఆర్‌ పాత్రలో మమ్ముట్టి నటించారు. 2019 ఫిబ్రవరి 8న విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది.  ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘యాత్ర 2’ మూవీని తెరకెక్కిస్తున్నారు మహి వి.రాఘవ్‌. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జీవితంలోని కొన్ని ఘటనల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది.

ఈ మూవీలో వైఎస్‌ జగన్‌ పాత్రలో తమిళ హీరో జీవా నటిస్తున్నారు. ‘యాత్ర’లో వైఎస్‌ఆర్‌ పాత్ర పోషించిన మమ్ముట్టి ‘యాత్ర 2’ లోనూ అదే పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలోని వైఎస్‌ రాజశేఖర రెడ్డి, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాత్రలకు సంబంధించిన  ఫస్ట్‌ లుక్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ‘నేనెవరో ఇంకా ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ, ఒక్కటి గుర్తు పెట్టుకోండి... నేను వైఎస్‌ రాజశేఖర రెడ్డి కొడుకుని’ అనే అనే డైలాగ్స్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో ఉన్నాయి.

మహి వి.రాఘవ్‌ మాట్లాడుతూ–‘‘వైఎస్‌ జగన్‌గారు ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనల నేపథ్యంలో ‘యాత్ర 2’ రూపొందుతోంది. ఈ సినిమాని 2024 ఫిబ్రవరి 8న రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు. త్రీ ఆటమ్‌ లీవ్స్, వీ సెల్యులాయిడ్‌పై శివ మేక నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మధి, సంగీతం: సంతోష్‌ నారాయణన్.

మరిన్ని వార్తలు