పరిస్థితి దిగజారకముందే విడిపోయాం: నటుడు

18 May, 2021 09:13 IST|Sakshi

సీఐడీ, యే రిష్తా క్యా కెహ్లాతా హై నటుడు హృషికేశ్‌ పాండే ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమె చేయి పట్టుకుని నడవాలని కలలు గన్నాడు. పెద్దలను ఒప్పించి వారి సమక్షంలోనే 2004లో ఆమెను పరిణయమాడాడు. కానీ పెళ్లి తర్వాత అతడు అనుకున్నట్లు జరగలేదు. గొడవలు మొదలయ్యాయి. ఇద్దరి మధ్య మనస్పర్థలు తొంగిచూశాయి. దీంతో సరిగ్గా పది సంవత్సరాల తర్వాత ఇద్దరూ వేర్వేరేగా జీవించడం మొదలు పెట్టారు. ఏకంగా విడాకులు కావాలంటూ కోర్టుకెక్కారు. ఆ విడాకులు ఈ ఏడాది మార్చిలో మంజూరవడంతో అధికారికంగా విడిపోయినట్లు ప్రకటించారు.

తాజాగా ఈ విడాకుల గురించి హృషికేశ్‌ మాట్లాడుతూ.. 'ఒకానొక సమయంలో మేము భార్యాభర్తలుగా ఇక కలిసి ఉండలేం అనిపించింది. పరిస్థితులు చేజారకముందే విడివిడిగా జీవించడం మొదలు పెట్టాం. నా వ్యక్తిగత జీవితం గురించి అందరితో పంచుకోవడం ఇష్టం లేక ఇన్నేళ్లపాటు మౌనంగా ఉన్నాను. విడాకులు వచ్చేశాయి, కాబట్టి ఇప్పుడు దీని గురించి మాట్లాడొచ్చు అనిపిస్తోంది. అలా అని మేమేమీ పెద్ద కొట్లాటలకు దిగలేదు. ఇద్దరమూ పరిపక్వత చెందినవాళ్లమే కాబట్టి చాలా హుందాగా విడిపోయాం'.

'మా బంధం విచ్ఛిన్నమయిందంటూ వచ్చే వార్తలు నా కొడుకు దక్షయ్‌ చెవిన పడటం నాకిష్టం లేదు. నేను మౌనంగా ఉండటానికి వీడు కూడా ఓ కారణం. వాడికిప్పుడు 12 ఏళ్లు. అతడు నా దగ్గరే పెరుగుతున్నాడు. నేను ఎక్కువ కాలం షూటింగ్‌లో గడిపేసినప్పుడు వాడు ఇంట్లో ఒంటరిగా ఉండటం నన్ను బాధిస్తోంది అందుకే మంచి హాస్టల్‌లో చేర్పించేందుకు అడ్మిషన్‌ తీసుకున్నా. తను కావాలనుకున్నప్పుడు తన తల్లిని కలుసుకోవచ్చు' అని నటుడు చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ ప్రేమను నమ్ముతానంటోన్న హృషికేశ్‌ ఇప్పుడప్పుడే మళ్లీ లవ్‌లో పడే ఉద్దేశ్యం లేదని చెప్పుకొచ్చాడు.

చదవండి: కోలివుడ్‌ను కుదిపేస్తున్న కరోనా: దర్శకుడి భార్య మృతి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు