ఔత్సాహిక ద‌ర్శ‌కుడి కిడ్నాప్ డ్రామా, రూ.30 ల‌క్ష‌లు తెలంగాణ‌కు తెచ్చివ్వు

20 Jan, 2022 15:26 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చెన్నై(త‌మిళ‌నాడు): సినిమాల్లోకి రావాల‌ని ఎంతోమంది క‌ల‌లు కంటుంటారు. ఆ క‌ల‌ను సాకారం చేసుకునేందుకు ఎంత‌గానో క‌ష్ట‌ప‌డ‌తారు. కానీ 24 ఏళ్ల ఔత్సాహిక ద‌ర్శ‌కుడు దొడ్డిదారిన డ‌బ్బులు సంపాదించి దాంతో ఎలాగైనా షార్ట్ ఫిలిం తీయాల‌నుకున్నాడు. తీరా త‌న ప్లాన్ బెడిసికొట్ట‌డంతో అంద‌రి చేత చీవాట్లు తిన్నాడు.

త‌మిళ‌నాడులోని చెన్నైకి చెందిన ఓ వ్య‌క్తి షార్ట్ ఫిలిం తీయాల‌నుకున్నాడు. ఇందుకోసం త‌న తండ్రి పెన్సిల‌య్య‌ రూ.30 ల‌క్ష‌లు అడ‌గ్గా ఆయ‌న అంత‌మొత్తం ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని తిర‌స్క‌రించి కేవ‌లం రూ.5 ల‌క్ష‌లు అప్ప‌జెప్పాడు. దీంతో ఆ యువకుడు త‌న స్నేహితుల‌తో క‌లిసి కిడ్నాప్ డ్రామా ఆడాడు. 30 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ న‌గ‌దు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. అది కూడా తెలంగాణ‌కి తీసుకురావాల‌ని, ఈ విష‌యం పోలీసుల‌కు చెబితే చంపేస్తామ‌ని బెదిరించారు.

దీనిపై పెన్సిల‌య్య పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా వారు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో ఇదంతా ఫేక్ కిడ్నాప్ డ్రామా అని గుర్తించిన పోలీసులు ఇద్ద‌రు స్నేహితుల‌తో క‌లిసి ఉన్న స‌ద‌రు యువ‌కుడిని సికింద్రాబాద్‌లోని హోట‌ల్ గ‌దిలో ప‌ట్టుకున్నారు. విచార‌ణ‌లో పార్ట్ ఫిలిం కోసమే ఇదంతా చేశామ‌ని నేరం అంగీక‌రించ‌డంతో పోలీసులు వారిని మంద‌లించి పంపించివేశారు.

మరిన్ని వార్తలు