'1జీబీ ఆగ పట్టుకొని పెళ్లి చూడండి.. ఎవరింట్ల వాళ్లు బువ్వు తినుర్రి'

30 Apr, 2021 09:24 IST|Sakshi

నెట్టింట వైరలవుతున్నఅనిల్‌ వెడ్డింగ్‌ కార్డ్‌

విందు నుంచి బరాత్‌, కట్నాలు అంతా అన్‌లైన్‌లోనే

కరోనా టైంలో క్రియేటివ్‌గా రూపొందించిన పెళ్లి పత్రిక

 

నంగునూరు (సిద్దిపేట): సాధారణంగా ఏ పెళ్లి పత్రికలో చూసినా శ్రీరస్తు.. శుభమస్తు.. అవిఘ్నమస్తు అంటూ మొదలుపెడతారు. కానీ ఇది ఈ పెళ్లి పత్రికలో మాత్రం శానిటైజర్ ఫస్టు.. మాస్క్ మస్టు.. సోషల్ డిస్టెన్స్ బెస్ట్ అని ఉంది. అసలే కరోనా టైంలో పెళ్లి కదా..అందుకే ఇలా వినూత్నంగా వెడ్డింగ్‌ కార్డును రూపొందించారు. 'వధూవరులకు కరోనా నెగిటివ్‌, మరువకుండా మీ ఫోన్‌ల 1-జీబీ డాటా ఆగపట్టుకొని పిల్లా..జెల్లా..ఐసోల్లు..ముసలోల్లు అందరూ ఫోన్‌ల ముందు అంతర్జాలంలో పెండ్లిసూసి ఆన్‌లైన్‌లో ఆశీర్వదించగలరు. విందు..లైవ్‌లో తల్వాలు పడ్డంక ఎవ్వరింట్ల ఆళ్లు బువ్వు తినుర్రి. బరాత్‌ ఉంది కానీ ఎవరింట్ల వాళ్లు పాటలు పెట్టుకొని ఎగురుర్రి. మీరు ఎగిరిన15 సెకన్ల వీడియో మాకు పంపుర్రి..దాన్ని వ్లోగ్‌లో పెడతాం.

ఇక కట్నాలు, కానుకలు గూగుల్‌ పే లేదా ఫోన్‌ పే ద్వారా క్యూఆర్‌ స్కాన్‌ చేసి పంపండి' అంటూ రూపొందించిన ఈ ఫన్నీ వెడ్డింగ్‌ కార్డ్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది. ఈ పెళ్లి పత్రిక మరెవరిదో కాదండీ..ప్రముఖ యూట్యూబర్‌, మై విలేజ్‌ షో సభ్యుడు అనిల్‌ది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గపల్లి గ్రామానికి చెందిన యూట్యూబర్‌ జీల అనిల్‌..మే1న తన వివాహం ఉందని ఈ తంతును అందరూ ఆన్‌లైన్‌లో తప్పకుండా వీక్షించాలని కోరుతూ ‘కరోనా కాలంలో లగ్గం పత్రిక’ అంటూ క్రియేటివ్‌గా వెడ్డింగ్‌ కార్డును రూపొందించారు.

అంతేకాకుండా పెళ్లికి సమర్పించే కట్న, కానుకలను కరోనా కాలంలో తిండి లేకుండా బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం అందించబడుతుందని పేర్కొన్నారు. మై విలేజ్‌ షోతో పాపులర్‌ అయిన అనిల్‌ కరోనా కాలంలో తాము చేసుకునే పెళ్లి సమాజానికి ఆదర్శంగా నిలవాలని భావించి ఇలా క్రియేటివ్‌గా డిజైన్‌ చేయించారు. 

A post shared by ANIL GEELA (@myvillageshow_anil)

మరిన్ని వార్తలు