భార్యతో సహా కటకటాలపాలైన యూట్యూబర్‌ మదన్‌

19 Jun, 2021 09:32 IST|Sakshi

చెన్నై: పబ్జీ ఆన్‌లైన్‌ గేమ్‌తో కోట్ల రూపాయలు మోసగించిన యూట్యూబర్‌ టాక్సిక్‌ మదన్‌ను ధర్మపురిలో శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని చెన్నైకు తీసుకురానున్నారు. ఆన్‌లైన్‌ పబ్జీ గేమ్‌లో ప్రత్యర్థులపై అసభ్య వ్యాఖ్యల వ్యవహారం గురించి సెంట్రల్‌ క్రైంబ్రాంచి పోలీసులు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ సమాచారం దావానలంలా వ్యాపించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్‌ ద్వారా యూట్యూబర్‌ మదన్‌పై 160 ఫిర్యాదులు అందాయి. పోలీసులు తనను వెతుకుతున్నట్లు తెలుసుకున్న మదన్‌ వీపీఎన్‌ సర్వర్‌ ఉపయోగించి తానున్న స్థావరాన్ని ఎవరూ గుర్తించలేని విధంగా తప్పించుకున్నాడు.

మదన్‌ ప్రారంభించిన మూడు యూట్యూ బ్‌ చానెళ్లకు భార్య కృత్తిక అడ్మిన్‌గా ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆమెను బిడ్డతో సహా పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతోపాటు మదన్‌ తండ్రి మాణిక్కం వద్ద పోలీసులు విచారణ జరిపారు. మదన్‌ స్నేహితులు, సన్నిహితుల గురించి ఆరా తీస్తున్నారు. ఇలావుండగా మదన్‌ ధర్మపురిలో దాగివున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో శుక్రవారం పోలీసులు అక్కడికి వెళ్లి మదన్‌ను అరెస్టు చేశారు. మదన్‌ పోలీసుల కాళ్లపై పడి క్షమించమని ప్రాధేయపడ్డాడు. ఇకపై పోలీసులు, ప్రముఖులను అసభ్యంగా మాట్లాడనని రోదించాడు. పోలీసులు అతన్ని చెన్నైకు తీసుకువస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు