'సంజయ్‌.. ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుసు'

12 Aug, 2020 10:18 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్ ‌దత్‌ గత ఆదివారం అనారోగ్య సమస్యతో ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అనధికారిక సమాచారం మేరకు సంజయ్‌ దత్‌ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయనకు క్యాన్సర్‌ 4వ దశలో ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి చికిత్స చేయించుకోవడానికి మంగళవారం రాత్రి అమెరికా వెళ్లినట్లు తెలిసింది. అయితే ఆయన అమెరికా వెళ్లారా లేదా అనే దానిపై స్పష్టత రాలేదు. తాజాగా సంజయ్‌ దత్‌ క్యాన్సర్‌ నుంచి త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు  భారత మాజీ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ట్విటర్‌ వేదికగా పేర్కొన్నాడు.(ఆస్ప‌త్రిలో చేరిన బాలీవుడ్ న‌టుడు)

'సంజయ్‌ దత్‌.. నువ్వు ఒక ఫైటర్‌లా కనిపిస్తావు. నీ బాధ తెలుసుకున్నా.. ఆ నొప్పి ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను.. ఎందుకంటే నేను స్వయంగా అనుభవించాను. కానీ ఆ నొప్పిని భరించేందుకు నువ్వు మరింత ధృడంగా తయారవ్వాలి.. క్యాన్సర్‌ మహమ్మారి నుంచి తొందరగా కోలుకోవాలని ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అంటూ ట్వీట్‌ చేశాడు. ​కాగా గతంలో యువరాజ్‌ కూడా లంగ్‌ క్యాన్సర్‌ బారీన పడిన సంగతి తెలిసిందే. 2011 ప్రపంచకప్‌ అనంతరం యువరాజ్‌ లండన్‌ వెళ్లి శస్త్రచికిత్స తీసుకొని విజయవంతంగా క్యాన్సర్‌ను జయించాడు. సంజయ్‌ దత్‌ చికిత్సకు సంబంధించి అమెరికా వెళ్లే విషయమై ఆయన టీం అధికారిక సమాచారం ఇవ్వాల్సి ఉంది.(సంజయ్‌దత్‌కు క్యాన్సర్‌!)

ఇదిలా ఉంటే గత ఆదివారం శ్వాస సంబంధిత ఇబ్బందితో సంజయ్‌ ఆదివారం  లీలావతి ఆస్పత్రికి వెళ్లారు. ఒక రోజు తర్వాత ఇంటికి వచ్చేశారు. పరీక్షల్లో కరోనా నెగిటివ్‌ వచ్చిందని మాత్రమే బయటకు తెలిపారు. కానీ, మంగళవారం ఆయన మళ్లీ ఆస్పత్రికి వెళ్లారు. వైద్య పరీక్షలు చేయగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ నిర్ధారణ అయ్యిందని సమాచారం. ఈ విషయాన్ని ఆయన మంగళవారం స్వయంగా తన ఇన్‌స్టాలో వెల్లడించారు.

'హాయ్‌ ఫ్రెండ్స్‌...వైద్యం నిమిత్తం నేను పని నుంచి చిన్న విరామం తీసుకుంటున్నాను.నా కుటుంబం, మిత్రులు తోడుగా ఉన్నారు. నా గురించి ఆందోళన చెందవద్దు, ఊహాగానాలు చేయవద్దని శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరి ప్రేమాభిమానాలతో త్వరలోనే తిరిగివస్తా’ అని సంజయ్‌ మంగళవారం తన ఇన్‌స్టాలో పేర్కొన్నారు. కాగా విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంజయ్‌ దత్‌ గతేడాది.. కళంక్‌, ప్రస్తానం, పానిపట్‌ చిత్రాలతో అలరించారు. తాజాగా  1991లో మహేశ్‌ బట్‌ దర్శకత్వంలో వచ్చిన హిట్‌ మూవీ సడక్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న సడక్‌ 2లో నటిస్తున్నారు. ఆదిత్యారాయ్‌ కపూర్‌, ఆలియా భట్‌ ప్రధాన పాత్రలో.. పూజాభట్‌ కీలక పాత్ర పోషిస్తున్న‌ ఈ చిత్రానికి మహేశ్‌ భట్‌ దర్శకత్వం వహిస్తుండగా.. ఆయన సోదరుడు ముఖేశ్‌ భట్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా