అప్పుడు నా బరువు జాతీయ సమస్యలా మారింది: హీరోయిన్‌

18 Jun, 2021 16:46 IST|Sakshi

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ వీర్‌ మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది నటి జరీన్‌ ఖాన్‌. కత్రినా కైఫ్‌ ఫీచర్స్‌తో ఉన్న ఆమెను కావాలనే వీర్‌ మూవీలో సల్మాన్‌ హీరోయిన్‌గా పెట్టుకున్నాడు. అయితే ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. తొలి చిత్రంతోనే పరాజయం చవి చూసిన జరీన్‌ ఖాన్‌ ఆతర్వాత వెంటనే హిందీతో పాటు తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించింది. అయితే అవి కూడా ఆమెకు ఆశించిన గుర్తింపును ఇవ్వలేదు. ఇక అవకాశాలు తగ్గడంతో నటనకు దూరమయ్యారు. ఈ క్రమంలో ఇటీవల కాస్టింగ్‌ కౌచ్‌పై నోరు విప్పిన ఆమె తాజాగా ఆమె తన శరీరాకృతిపై ఎదుర్కొన్న విమర్శలను గుర్తు చేసుకున్నారు. అవగాహన లోపంతో తొలి చిత్రంతోనే ఘోరమైన అవమానాలను ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫస్ట్‌ కెమెరా అనుభవాన్ని పంచుకున్నారు.\

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘20 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చాను. వీర్‌ మూవీతో ఫస్ట్‌టైం కెమెరా ముందుకు వచ్చాను. అయితే అప్పుడు ఇప్పటితరం వారిలా నాకు అన్ని విషయాలపై అంతగా అవగాహన లేదు. దీంతో ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. వీర్‌ మూవీ షూటింగ్‌ తొలి రోజు కెమెరా ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదు. అప్పుడు అంత కొత్తగా అనిపించేది. సినిమాలు, షూటింగ్‌లపై నాకు పెద్దగా అవగాహన లేదు. ఎంతో మంది అనుభవం ఉన్న వ్యక్తులతో నా తొలి చిత్రం వీర్‌ మూవీ చేశాను. దీంతో సినిమా పరంగా ఎవరు ఎలాంటి సూచనలు ఇచ్చిన అవి పాటించేదాన్ని’ అంటూ ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలో వీర్‌ షూట్‌ సమయంలో కొంతమంది తనని బరువు పెరగమని సలహా ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు.

‘మూవీ షూటింగ్‌ సమయంలో నా పాత్ర కోసం కాస్తా బరువు పెరగమని కొందరూ చెప్పారు. వాళ్లు చెప్పినట్టు గానే బరువు పెరిగాను. ఇక మూవీ విడుదల తర్వాత నా శరీరాకృతిపై విపరీతమైన కామెంట్స్‌ వచ్చాయి. అవి చూసి తట్టుకోలేకపోయా. ఆ మూవీ సమయంలో నా శరీర బరువు జాతీయ సమస్యలా మారింది. పరిశ్రమలోని వారు, బయటి వారు ప్రతి ఒక్కరు నా బరువు గురించే మాట్లాడుకున్నారు. ఒకానోక సమయంలో ‘వీర్‌’ మూవీ నా బరువు వల్లే ప్లాప్‌ అయ్యిందనే వ్యాఖ్యలు కూడా చేశారు. అది విని తట్టుకోలేకపోయా. ఆ తర్వాత కొన్నాళ్లకు అవి అలవాటు అయిపోయాయి. ఒక నటికి ఇలాంటివి సాధారణమనే విషయాన్ని గ్రహించాను. అప్పుడే ఏది శాశ్వతం కాదనే అభిప్రాయానికి వచ్చాను. కాబట్టి ఏది హృదయానికి తీసుకోకూడదని తెలుసుకున్నాను చెప్పాలంటే ఈ పరిశ్రమ నాకు చాలా నేర్పింది’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. 

చదవండి: 
ముద్దు సీన్‌ రిహార్సల్‌ అంటూ దారుణంగా ప్రవర్తించేవాడు: హీరోయిన్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు