Zee Saregamapa: 'జీ సరిగమప'లో శృతిక గెలుచుకున్న ఖరీదైన బహుమతులు ఇవే..

14 Aug, 2022 16:38 IST|Sakshi

సుమారు 26 వారాలపాటు నాన్-స్టాప్ వినోదాన్ని పంచి, ఎంతోమంది అద్భుతమైన సింగర్స్‌ని ప్రేక్షకులకు పరిచయం చేసి వారి అభిమానాన్ని చూరగొన్న 'జీ సరిగమప - ది సింగింగ్ సూపర్‌ స్టార్స్‌' కార్యక్రమం ముగిసింది. ఫినాలేలో అదరగొట్టే ప్రదర్శనలతో హైదరాబాద్‌కి చెందిన శృతిక సముద్రాల (20) టైటిల్ విజేతగా నిలిచింది. అలాగే తనకు గట్టి పోటీ ఇచ్చి వెంకట సుధాన్షు రన్నరప్‌గా నిలిచాడు. ప్రెస్టీజియస్ 'జీ సరిగమప - ది సింగింగ్ సూపర్‌ స్టార్స్‌' ట్రోఫీతో పాటు, శృతిక రూ. లక్ష నగదు, మారుతి సుజుకి వాగన్-ఆర్ కారుని బహుమానంగా అందుకుంది. ఇక రన్నరప్‌గా నిలిచిన వెంకట సుధాన్షు రూ. 5 లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నాడు.  

   

'ఏమాయె నా కవిత', 'మెరిసేటి పువ్వా', 'సంకురాత్రి కోడి', 'కొంచెం నీరు', 'ఆనతినీయరా' వంటి పాటలతో ఫినాలే లో జడ్జెస్ ని మెప్పించి, టైటిల్ గెలుచుకున్న శృతిక, బీఏ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) లో డిగ్రీ పూర్తిచేసింది. 6 సంవత్సరాల వయస్సులోనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన శృతిక, కర్నాటిక్ సంగీతంలో శిక్షణ తీసుకుంది. ఈ సందర్భంగా, శృతిక మాట్లాడుతూ... "జీ సరిగమప - ది సింగింగ్ సూపర్‌ స్టార్స్‌ విన్నర్ గా నిలవడం ఒక డ్రీం-కం-ట్రూ మూమెంట్. ఇది నా లైఫ్ లోనే బెస్ట్ మూమెంట్, ఎప్పటికి మరిచిపోలేనిది.

ఈ ట్రోఫీని నా కష్టానికి దక్కిన ప్రతిఫలంగా భావిస్తాను. నాతో పాటు, నా తోటి ఫైనలిస్ట్స్ కూడా అద్భుతంగా పాడారు. కాబట్టి వారికి కూడా సమానమైన గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. ఈ సరిగమప జర్నీలో వారు నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. వారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. అదేవిధంగా, ఈ జర్నీలో నాకు సహకరించిన జీ సరిగమప టీం, ముఖ్యంగా మెంటర్స్, జడ్జెస్, వాయిస్ ట్రైనర్లకి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే, నేను సింగర్ గా ఎదగడానికి ఎంతో సపోర్ట్ చేస్తూ వస్తున్న మా నాన్న శశికాంత్, అమ్మ రూప, అక్క శరణ్యకి, అలాగే సంగీతంలో ఓనమాలు నేర్పిన నా గురువులు శ్రీ రామాచారి కొమండూరి గారికి, శ్రీ నిహాల్ కొండూరి గారికి, వసుమతి మాధవన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు." అని తెలిపింది. 

ఆగష్టు 14 న ప్రసారమైన ఫినాలే ఎపిసోడ్‌లో లెజెండరీ సింగర్ పి. సుశీల, శృతి హాసన్, నితిన్, కృతి శెట్టి సమక్షంలో 8 మంది ఫైనలిస్ట్స్ అద్భుతమైన ప్రదర్శనలతో మైమరిపించారు. ఈ ఫినాలే స్టేజ్ వేదికగా పి. సుశీల తాను  సంగీత ప్రపంచానికి చేసిన సేవలను గుర్తిస్తూ నిర్వహించిన సన్మానం ఎపిసోడ్ కే హైలైట్ గా నిలవగా, 'ఆజాది కా అమృత్ మహోత్సవ్' వేడుకల్లో భాగంగా మాజీ సైనికులకు చేసిన  సన్మానం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. 


 

మరిన్ని వార్తలు