నాణ్యమైన వైద్యసేవలు అందించాలి

24 Mar, 2023 05:56 IST|Sakshi
వైద్యులతో మాట్లాడుతున్న ఐటీడీఏ పీఓ అంకిత్‌

ములుగు: పలు రకాల అనారోగ్య సమస్యలతో వచ్చే వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ అంకిత్‌ ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. 15 రోజులుగా ములుగు–వెలుగు యాప్‌లో నమోదు అవుతున్న హాజరు, రిజిస్టర్‌, వైద్యులు, సిబ్బంది ఎంట్రీ, ఎగ్జిట్‌ సమయాలు, సీటీ స్కాన్‌, లేబోరేటరీ, ఎక్స్‌ రే యంత్రాల పనితీరు, ఓపీలను పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఓపీ అటెండెన్స్‌, వైద్య సేవల విషయమైన జిల్లాకేంద్రంతో పాటు ఐటీడీఏలో ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఇక ముందు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. స్పెషలిస్టు వైద్యులు కేటాయించిన సమయంలో రోగులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రి, వెంకటాపురం(కె) ఆస్పత్రి, ఆయా పీహెచ్‌సీల నుంచి ఏరియా ఆస్పత్రికి చాలా కేసులు రెఫర్‌ అవుతున్నాయని అన్నారు. వారందరికీ భరోసా కల్పించి ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగించాలని చెప్పారు. వైద్యం అనేది బాధ్యతాయుతమైన సేవ అనేది గుర్తుంచుకోవాలని చెప్పారు. ఏరియా ఆస్పత్రి నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ సర్వే(ఎన్‌క్యూఏఎస్‌)కు ఎంపికైందని అన్నారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగదీశ్‌, డీసీహెచ్‌ఎస్‌ జాన్సన్‌, వైద్యులు వంశీకృష్ణ, సృజన, పట్టాభిరామారావు, ప్రత్యూష, రాజేంద్రప్రసాద్‌, శ్రమలత, సుధీర్‌రెడ్డి, సుష్మ, అనిల్‌కుమార్‌, స్వప్న, లిఖిత, నవీన్‌గౌడ్‌, అనితశ్రీ, దీప, మౌనిశ్రీ, వినయ్‌భాస్కర్‌ పాల్గొన్నారు.

ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేసిన ఐటీడీఏ పీఓ

మరిన్ని వార్తలు