ఆదివారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2023

26 Mar, 2023 01:42 IST|Sakshi

8లోu

బలగానికి మరింత బలం ‘వేణు’

బలగం సినిమా చూస్తున్నంత సేపు మట్టి మనుషుల వాసనొస్తుంది. మానవ సంబంధాల పరిమళం గుభాళిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే సినిమాలో లీనమైపోతాం. అలా చేయడంలో దర్శకుడి పాత్ర ఎంతుందో.. సినిమాటోగ్రాఫర్‌ పాత్ర కూడా అంతే ఉంది. షాట్‌ను ఎలా చిత్రీకరించాలి? ఏ లొకేషన్‌లో ఏ కెమెరా వాడాలి. లైట్స్‌ వినియోగం.. లొకేషన్‌ సెట్టింగ్‌ ఇలా బలగం సినిమాకు సినిమాటోగ్రాఫర్‌ ఆచార్య వేణు మరింత బలం చేకూర్చారు. వేణుది భూపాలపల్లి జిల్లా రంగయ్యపల్లి. కోల్‌కతాలోని ప్రఖ్యాత సినీరంగ బోధన సంస్థ ‘సత్యజిత్‌ రే ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌’లో మోషన్‌ ఫొటోగ్రఫీలో పీజీ డిప్లమా పూర్తి చేశారు. మొదటి చిత్రం గారో భాషలో ‘మా.. అమా’ సినిమా ద్వారా అంతర్జాతీయ చిత్రోత్సవంలో ‘ఏషియన్‌ న్యూ టాలెంట్‌’ పురస్కారాన్ని అందుకున్నారు. ఆతర్వాత జెర్సీ సినిమాకు పనిచేశారు. టాలీవుడ్‌లో బలగం సినిమాకు పూర్తి స్థాయిలో సినిమాటోగ్రాఫర్‌గా చేశారు. సినిమా విజయంలో భాగమయ్యారు.

పాటల ఊట ‘శ్యామ్‌’

హనుమకొండ బ్రాహ్మణవాడలోని కాసర్ల మధుసూదన్‌, మాధవి దంపతుల కుమారుడు శ్యామ్‌. చిన్నతనంలోనే జానపద కళాకారులు సారంగపాణి, శంకర్‌ను అనుసరిస్తూ అనేక జానపదాలు రాశారు. అంతటితో ఆగకుండా సినీ రంగంలో ప్రవేశించి ఇప్పటి వరకు 300లకు పైగా పాటలు రాశారు. ప్రతి పాట వన్స్‌మోర్‌ అనేలా ఉండడం ఆయన ప్రతిభకు నిదర్శనం. ఇందులో ‘రాములో.. రాములా.. డీజే టిల్లూ పేరు.. నీలపురి గాజుల ఓ నీలవేణీ.. నిన్ను చూడబుద్ధి అవుతుంది రాజిగో.. ఇలా అనేక పాటలు రాశారు. బలగం సినిమాలో అన్ని పాటలు రాయడమే కాదు.. సినిమాలో పాత్రల ఎంపిక, షూటింగ్‌, సన్నివేశాలు.. ఇలా అన్ని విషయాల్లో దర్శకులు వేణుకు సహకారం అందించారు.

చిన్న చిన్న సమస్యలతో తోబుట్టువులను, మన కోసం పరితపించే పుట్టెడు బలగాన్ని కొందరు దూరం చేసుకుంటున్నారు. తిరిగి అందరూ కలిస్తే కలిగే బలమే ‘బలగం’. గ్రామీణ జీవితం ఇతివృత్తంతో ఒక కుటుంబ పెద్ద చనిపోతే ఆ ఇంట్లో జరిగే గొడవలు.. అనుబంధాలతో తెరకెక్కిన ఈ చిత్రం అందరినీ థియేటర్‌కు రప్పించి.. కన్నీరు పెట్టించింది. ఇంత గొప్ప సందేశాన్ని ప్రపంచానికి అందించిన సినిమాలో మన బలగం (ఓరుగల్లు కళాకారులు) కీలకపాత్ర పోషించింది. వారిపై ‘సాక్షి’ సండే స్పెషల్‌ స్టోరీ.

మైమరిపించిన ‘మధు’

హనుమకొండ పట్టణంలోని భీమారం ప్రాంతానికి చెందిన రిటైర్డ్‌ రెవెన్యూ ఉద్యోగి ఓదెలు, వినోదల కుమారుడు మధుసూదన్‌(మధు). చిన్నప్పటి నుంచే మైమ్‌ కళాకారుడిగా వేలాది స్టేజీ షోలు ఇచ్చారు. ప్రపంచ మైమ్‌ ప్రదర్శనల్లో ఉత్తమ కళాకారుడిగా ఎంపికయ్యారు. ప్రపంచ మైమ్‌ థియేటర్‌కు ఎంపికై న రెండో ఆసియావాసిగా పేరు తెచ్చుకున్నారు. ఉస్తాద్‌ బిస్మిల్లాఖాన్‌ సంగీత, నాటక, రంగస్థల అవార్డు గ్రహీతగా, నాటకరంగంలో అతి చిన్న వయస్సులోనే ఉత్తమ నంది అవార్డు అందుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. సినిమా, నాటక, టీవీ అనేక రంగాల్లో రాణిస్తున్న కళాకారుడు మైమ్‌ మధు. బలగం సినిమాలో కొమురయ్య చిన్నకొడుకు మొగిలయ్య పాత్రలో నటించారు. బతుకుదెరువు కోసం సూరత్‌ వెళ్లిన అతను తండ్రి చనిపోగానే ఇంటికి రావడం, అన్నాదమ్ముల మధ్య పంచాయితీ, అనుబంధం, డబ్బులు లేమితనం దృశ్యాల్లో కళ్లకు కట్టినట్లు నటించారు.

– సాక్షి, మహబూబాబాద్‌/దుగ్గొండి

జానపదం.. సినిమాకు ప్రాణపదం!

‘తోడుగా మాతోడుండి.. నీడగా మాతో నడిచి.. నువ్వెక్కడికెళ్లినావు కొంరయ్యా..’ అంటూ తంబుర, దిమ్మిసతో పాడిన పాట ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసి కంటనీరు పెట్టించింది. ఈ పాట పాడింది.. ఎవరో కాదు.. మన వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడిగ జంగాలు పస్తం మొగిలయ్య– కొంరమ్మ దంపతులు. బలగం సినిమా డైరెక్టర్‌ వేణు తన సినిమాలో జానపద కళలు, కళారూపాలకు ప్రాతినిథ్యం కల్పించాలని సింధు కళాకారులు, మందహెచ్చలు, బుడిగ జంగాల కళాకారులతో పాడించారు. ఇదే తరుణంలో.. దుగ్గొండికి వచ్చి పస్తం మొగిలయ్య–కొంరమ్మతో అనేక రకాల దరువులతో పాటలు పాడించుకున్నారు. దరువులు నచ్చాయని చెప్పి వెళ్లి 30 రోజులకు అందిన పిలుపుతో దంపతులిద్దరూ హైదరాబాద్‌ వెళ్లి 14 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నారు. బలగం సినిమా చివరలో మొగిలయ్య–కొంరమ్మలు పాడిన పాట హిట్‌గా మారి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచింది.

కంట తడిపెట్టించి... పుట్టెడు కష్టాల్లో

తమ పాట ద్వారా కోట్లాది మంది ప్రేక్షకులను కంటతడి పెట్టించిన మొగిలయ్య.. ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఏడాది క్రితమే ఆయనకు కిడ్నీ సమస్య వచ్చింది. రెండు కిడ్నీలు పాడయ్యాయి. దీంతో డయాలసిస్‌ ద్వారా జీవనం సాగిస్తున్నాడు. రెండు కళ్లు చూపు కోల్పోయాయి. సినిమా విజయవంతమవడంతో సంబరాలు జరుపుకోవాల్సిన మొగిలయ్య కుటుంబం ఇప్పుడు పుట్టెడు కష్టాలతో జీవనం సాగిస్తోంది.

పాత్రకు ప్రాణం పోసిన ‘ప్రభాకర్‌’

వరంగల్‌ పట్టణంలోని గేటు కింద ఏరియాలో నివాసం ఉండే సీనియర్‌ కళాకారులు వేముల ప్రభాకర్‌. యాభై ఏళ్లుగా కళామతల్లినే నమ్ముకొని జీవిస్తున్నారు. సమాజంలోని రుగ్మతలను పారదోలేందుకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని గ్రామ గ్రామాన తిరిగి నాటక ప్రదర్శనలు చేశారు. బలగం సినిమాలో గ్రామ పెద్ద పాత్రకు జీవం పోశారు. తెలంగాణలోని గ్రామ పెద్దలు, కట్టుబాట్లను తెలిపే పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది.

బీమ్స్‌.. అదుర్స్‌..

మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం గ్రామానికి చెందిన బీమ్స్‌కు చిన్నప్పటి నుంచి పాటలు రాయడం, పాడడం అలవాటు. ఈ ఇష్టంతోనే సినిమా రంగంలో ప్రవేశించారు. ‘బాబూ ఓ రాంబాబు’తోపాటు అనేక పాటలు రాసి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. బలగం సిని మాకు సంగీత దర్శకుడిగా పనిచేసి ప్రతి పాటను వీనుల విందుగా తీర్చిదిద్దారు. బ్యాక్‌గ్రౌండ్‌ పాటలకు సైతం సన్నివేశాలకు తగిన విధంగా సంగీతం అందించారు.

బంధాన్ని గుర్తు చేసిన ‘బాబు’

బలగం సినిమాలో మరో కీలక పాత్రలో అద్భుత నటన ప్రదర్శించి జీవం పోసిన గుడిబోయిన బాబుది వరంగల్‌ జిల్లా రాయపర్తి మండల కేంద్రం. సాంఘిక, సామాజిక చైతన్య నాటకాలు, తొమ్మిది సినిమాల్లో నటించారు. బలగం సినిమాలో కొమురయ్య తమ్ముడు అంజయ్య పాత్రలో నటించాడు. అన్న కొడుకులు పంచాయితీ పెట్టుకుంటే.. కనీసం సమాధి కట్టేందుకు నాలుగు గజాల జాగా కాడ కూడా గొడవ పెట్టుకోవడం చూసి తల్లడిల్లిపోయిన పాత్రతో సినిమా చూసిన వారికి కంట తడి పెట్టించారు.

తెరవెనుక, తెరపైన ఓరుగల్లు కళాకారులు

ప్రతీ పాత్రలోనూ జీవించిన నటులు

పాటల రచయిత, సంగీతం, సినిమాటోగ్రఫీ మన వాళ్లే

కంటతడి పెట్టించిన మొగిలయ్య–కొంరమ్మల పాట

న్యూస్‌రీల్‌

>
మరిన్ని వార్తలు