పనులు త్వరగా పూర్తిచేయాలి

26 Mar, 2023 01:42 IST|Sakshi
ఏఈ అజిత్‌తో మాట్లాడుతున్న కలెక్టర్‌

ములుగు: జిల్లా కేంద్రంలోని జూనియర్‌ కళాశాల ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న రేడియాలజీ హబ్‌ సుందరీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. ఈ మేరకు శనివారం రేడియాలజీ హబ్‌తో పాటు పంచాయతీరాజ్‌, ఉద్యానవన శాఖ, ముఖ్య ప్రణాళిక కార్యాలయాలను ఆకస్మికంగా శనివారం తనిఖీ చేశారు. రేడియాలజీ హబ్‌లో అమర్చే యంత్రాల విషయంలో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ జగదీశ్‌కు సూచనలు చేశారు. ముఖ్య ప్రణాళిక కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు, ఉద్యానశాఖలో కార్యాలయ సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయం చుట్టూ చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ములుగు–వెలుగు యాప్‌లో హాజరు నమోదు చేయాలన్నారు. కలెక్టర్‌ వెంట సీపీఓ ప్రకాశ్‌, ఉద్యానశాఖ అధికారి రమణ, పంచాయతీరాజ్‌ ఏఈ అజిత్‌, తదితరులు పాల్గొన్నారు. అనంతరం పదో తరగతి పరీక్షలపై కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 3,170 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు.

నీలి విప్లవంతో ఆర్థికాభివృద్ధి

ఎస్‌ఎస్‌తాడ్వాయి: నీలి విప్లవంతో గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని జిల్లా పెసా కో ఆర్డినేటర్‌ కొమురం ప్రభాకర్‌, జిల్లా మత్య్సశాఖ అధికారి శ్రీపతి అన్నారు. మండల పరిధిలోని ఆశన్నగూడ, ఎల్లపూర్‌, గంగారం, మేడారం, వెంగ్లాలపూర్‌, ఊరట్టం గ్రామాల్లోని గిరిజన మత్స్యకారులకు శనివారం జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి సమక్షంలో మండల కేంద్రంలోని జిన్నల చెరువులో నైపుణ్యత పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గిరిజనుల్లో నీలి విప్లవాన్ని ప్రోత్సాహిస్తుందన్నారు. మత్స్య సంఘాల ఏర్పాటు ద్వారా ఉచిత చేప పిల్లలు, వలలు, తెప్పలను 75 శాతం రాయితీతో శీతలీకరణ వాహనాలతో పాటు ప్రమాద బీమా కింద రూ. 5లక్షలు ప్రభుత్వమే స్వయంగా అందిస్తుందన్నారు. ఈ సమావేశంలో గంగారం సర్పంచ్‌ గౌరబోయిన నాగేశ్వరరావు, మత్స్య క్షేత్ర అధికారి రమేష్‌, జీసీసీ డైరెక్టర్‌ పులసం పురుషోత్తం, ఆదివాసీ అడ్వకేట్‌ మడి సాయిబాబు, మత్స్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు