వివాహిత ఆత్మహత్యాయత్నం

12 Mar, 2023 18:54 IST|Sakshi
నాటకాన్ని ప్రదర్శిస్తున్న కళాకారులు

వేములపల్లి: సాగర్‌ ఎడమకాల్వలో దూకి వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన శనివారం సాయంత్రం మండలంలోని శెట్టిపాలెం గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మొల్కపట్నం గ్రామానికి చెందిన గాదె రమ్య కుటుంబ కలహాలతో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో భర్త నాగరాజుతో గొడవపడి గశెట్టిపాలెం గ్రామ శివారులోని సాగర్‌ ఎడమకాల్వ వద్దకు చేరుకుని కాల్వలోకి దూకింది. గమనించిన స్థానికులు వెంటనే కాల్వలోకి దూకి రమ్యను కాపాడి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు రమ్య చేతికి అయిన గాయాన్ని గుర్తించి మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం రమ్యకు కౌన్సిలింగ్‌ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

బంగారు గొలుసు చోరీ

వలిగొండ : గుర్తుతెలియని వ్యక్తులు మహిళ మెడలోంచి బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ ఘటన వలిగొండ మండల పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వేములకొండకు చెందిన శాగంటి మంగమ్మ వ్యవసాయ బావి వద్ద పనిచేసుకుంటున్న క్రమంలో గుర్తుతెలియని ఇద్దరు ఆమె దగ్గరకు వెళ్లారు. గడ్డి దొరుకుతుందా, కొంటామని వివరాలు అడుగుతున్నట్లు చేసి ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారు గొలుసు లాక్కొని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై ప్రభాకర్‌ తెలిపారు.

చోరీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్‌

భువనగిరి : చోరీ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. భువనగిరి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై రాఘవేందర్‌గౌడ్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన దుర్గ ప్రసాద్‌, షేక్‌ ఆరీఫ్‌, పల్లాపు కళ్యాణ్‌ గత ఫిబ్రవరి 12వ తేదీన పట్టణ శివారులో ఉన్న శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో హుండీ తాళం పగలగొట్టి దొంగతానికి పాల్పడ్డారు. ఆలయ ఈఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా భువనగిరి రూరల్‌ పోలీసులు, సీసీఎస్‌ సహాకారంతో దొంగలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్‌ఐ తెలిపారు.

అలరించిన పద్య, సాంఘిక నాటకాలు

మిర్యాలగూడ : పట్టణంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, మిర్యాలగూడ సాంస్కృతి కళా కేంద్రం సంయుక్త నిర్వహణలో జాతీయ స్థాయి పద్య, సాంఘిక నాటక పోటీలు రెండోరోజు శనివారం అలరించాయి. మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం అధ్యక్షుడు భుజంగరావు, కార్యదర్శి పులి కృష్ణమూర్తి, కోశాఽధికారి పుల్లభట్ల లక్ష్మీనారాయణశర్మలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శనలను ప్రారంభించారు. రెండో రోజు ‘మహామంత్రి తిమ్మరసు’ పద్యనాటకం, పక్కింటి మొగుడు సాంఘిక నాటకం పలువురిని ఆకట్టుకున్నాయి.

బండి సంజయ్‌ నోరు అదుపులో పెట్టుకోవాలి

సూర్యాపేట: ఎమ్మెల్సీ, ఉద్యమకారురాలు కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నోరు అదుపులో పెట్టుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ హెచ్చరించారు. శనివారం ఆయన సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ మహిళా సమాజాన్ని కించపరిస్తే మహిళలు బండి సంజయ్‌ని బట్టలూడదీసి కొడతారన్నారు. మహిళలను కించ పరిచే బండి సంజయ్‌ నోరు ఫినాయిల్‌తో కడగాలన్నారు. మహిళలను గౌరవించలేని దౌర్భాగ్యపు అధ్యక్షుడున్న పార్టీ బీజేపీ అని విమర్శించారు. బీజేపీతో ఏదైనా తేల్చుకోవడానికి బీఆర్‌ఎస్‌ సిద్ధంగా ఉందన్నారు. ఆయన వెంట కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ వట్టె జానయ్య యాదవ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు