పెళ్లి సెలవులు ముగించుకుని డ్యూటీకెళ్తూ.. కానరాని లోకాలకు

31 May, 2023 01:52 IST|Sakshi

నల్గొండ: పైళ్లెన 19 రోజులకే నవ వరుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ ఘటన కొండమల్లేపల్లి మండల కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి మండలంలోని పెండ్లిపాకల గ్రామానికి చెందిన బొడ్డుపల్లి శ్రీనివాస్‌, అలివేలు దంపతుల ఏకై క కుమారుడు బొడ్డుపల్లి వెంకటేశ్‌(29) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ నెల 11న వెంకటేశ్‌కు గుర్రంపోడు మండలం పాల్వాయి గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిగింది.

పెళ్లి తర్వాత తిరిగి ఉద్యోగానికి వెళ్తున్న వెంకటేశ్‌ ఆదివారం సెలవు దినం కావడంతో స్వగ్రామానికి వచ్చాడు. కాగా పెండ్లిపాకల గ్రామంలో బొడ్రాయి ఉత్సవాలు ఉండడంతో సెలవులు పెట్టేందుకు సోమవారం వెంకటేశ్‌ స్వగ్రామం నుంచి బైక్‌పై హైదరాబాద్‌కు బయల్దేరి ఆఫీస్‌ పని ముగించుకొని తిరిగి స్వగ్రామానికి పయనయ్యాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కొండమల్లేపల్లి సమీపంలోని పెట్రోల్‌ బంక్‌ మూలమలుపు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోనే ఈ ఘటన జరగడంతో సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వీరబాబు తెలిపారు. పైళ్లెన కొద్దిరోజులకే రోడ్డు ప్రమాదంలో వెంకటేశ్‌ మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

పరామర్శించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు..
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన బొడ్డుపల్లి వెంకటేశ్‌ బీజేపీలో కొనసాగుతూ పెండ్లిపాకల గ్రామంలో 135వ బూత్‌ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. వెంకటేశ్‌ మరణ వార్త తెలుసుకున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతదేహం వద్ద నివాళులర్పించారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కర్నాటి సురేష్‌కుమార్‌, లాలునాయక్‌, బొడిగ సాంబశివగౌడ్‌, పేర్ల జితేందర్‌, భరత్‌కుమార్‌, కుంభం యాదగిరి, పాక నగేశ్‌, బోడ కృష్ణ, చిలువేరు శ్రీధర్‌, ఎండీ జహీర్‌, తారయ్య తదితరులున్నారు.

మరిన్ని వార్తలు