ప్రేమించి పెళ్లి.. గర్భవతైన భార్యను దిండుతో అదిమిపట్టి..

16 Sep, 2023 10:41 IST|Sakshi

నల్గొండ: మర్రిగూడ మండలం అజ్జలాపురంలో ఇటీవల వెలుగుచూసిన గర్భిణి అనుమానాస్పద మృతి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. కుటుంబ కలహాలు, క్షణికావేశంతో భర్తే ఆమెను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అరెస్ట్‌ చేసిన నిందితుడిని శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మీడియా ఎదుట ప్రవేశపెట్టి ఎస్‌ఐ రంగారెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. మర్రిగూడ మండలం కమ్మగూడేనికి చెందిన సుష్మిత, అజ్జలాపురం గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ ప్రేమించుకుని ఈ ఏడాది జనవరిలో వివాహం చేసుకున్నారు.

సుష్మిత ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి. దంపతుల మధ్య కొంతకాలంగా మనస్పర్థలు ఏర్పడి గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఈ నెల 10వ తేదీన రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది. క్షణికావేశానికి గురైన శ్రీకాంత్‌ దిండుతో సుష్మితను అదిమిపట్టి ఊపిరి ఆడనీయకుండా చేశాడు. అనంతరం మాల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఆ తర్వాత సుష్మిత మృతదేహాన్ని మర్రిగూడ ఆస్పత్రికి తీసుకొచ్చి అనారోగ్య కారణాలతో మృతిచెందినట్లు చిత్రీకరించాడు. మృతురాలి సోదరి శ్రీకాంత్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. కుటుంబ కలహాలు, క్షణికావేశంలోనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడిపై కేసు నమోదు చేసిన దేవరకొండ కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్‌ఐ వివరించారు.

మరిన్ని వార్తలు