చీరలను అపహరిస్తూ చిక్కిన కి‘లేడి’

16 Sep, 2023 07:14 IST|Sakshi
సీసీ ఫుటేజీలో రికార్డయిన చీరల చోరీ దృశ్యం

భూదాన్‌పోచంపల్లి : గుట్టుచప్పుడు కాకుండా చీరలను అపహరించిన మహిళను పట్టుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. బాధితుడు ధనుంజయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భూదాన్‌పోచంపల్లి పట్టణ కేంద్రంలోని సుష్మ మ్యాచింగ్‌ సెంటర్‌కు వచ్చిన గుర్తు తెలియని మహిళ చీరలు కావాలని చూపించమని కోరింది. ఆమెకు చీరలు చూపిస్తుండగానే గిరాకీ రావడంతో యజమాని వారితో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో గుర్తుతెలియని మహిళ రెండు చీరలను దొంగలించి బయటికి వెళ్లిపోయింది. కొద్దీ దూరం వచ్చి లోదుస్తుల్లో దాచిన చీరలను బయటికి తీసి కవర్‌లో వేస్తుండగా సమీపంలో ఉన్న ఓ వ్యక్తి గమనించి షాపు యజమానికి సమాచారం ఇచ్చాడు. గషాపులో ఉన్న సీసీ కెమెరాలో సీసీ ఫుటేజీని పరిశీలించగా అందులో చీరలు దొంగిలిస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన షాపు యజమాని ఆమెకోసం వెతుకుతుండగా స్థానిక మార్కండేయ దేవాలయం వద్ద కన్పించింది. పట్టుకొని ప్రశ్నించగా అమె పొంతనలేని సమాధానాలు చెప్పింది. దాంతో ఆమెను పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. అయితే పోలీసుల విచారణలో పట్టుబడిన మహిళ పేరు చేకూరి సునిత అని, తనది దిల్‌సుఖ్‌నగర్‌ అని చెబుతుంది. ఉదయం నుంచి చీరలు కావాలని, జాకెట్లు కుడుతారా అని పలు షాపుల్లో తిరిగినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఆరు నెలల క్రితం పట్టణ కేంద్రంలోని ఓ షాపులో చీరలు దొంగతనం కేసులో ఈమె పాత్ర ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

మరిన్ని వార్తలు