TS Elections 2023: త్వరపడండి.. నామినేషన్లకు రేపే ఆఖరు..!

9 Nov, 2023 11:28 IST|Sakshi

నేడు ఏకాదశి కావడంతో అత్యధికంగా దాఖలయ్యే అవకాశం

ముహూర్తం ఖరారు చేసుకున్న మంత్రి జగదీష్‌రెడ్డి, ఉత్తమ్‌, ముఖ్య నాయకులు

నామినేషన్లు వేయనున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు

కోలాహలంగా మారనున్న నియోజకవర్గ కేంద్రాలు

నల్లగొండ: జిల్లాలో నామినేషన్ల పర్వం చివరి దశకు చేరింది. ఈ నెల 10న నామినేషన్ల ఘట్టానికి తెరపడనుంది. ఈ నెల 3వ తేదీతో ప్రారంభమైన నామినేషన్ల పర్వం శుక్రవారంతో పూర్తవుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 నియోజక వర్గాల పరిధిలో ఇప్పటి వరకు కొద్ది మంది మాత్రమే అధికార, ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

9వ తేదీ గురువారం ఏకాదశి కూడా కావడంతో అంతా మంచి రోజని అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు పెద్ద ఎత్తున నామినేషన్ల దాఖలుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు నామినేషన్లు వేయని వారితో పాటు వేసిన వారు కూడా మరో సెట్‌ సమర్పించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ముఖ్య నాయకులంతా నేడే..
అన్ని నియోజకవర్గాల్లో గురువారం బీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌, సీపీఎం, బీజేపీ, ఫార్వర్డు బ్లాక్‌, ఇతర పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. నల్లగొండ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డితో పాటు ఫార్వర్డు బ్లాక్‌ పార్టీ అభ్యర్థి పిల్లి రామరాజు యాదవ్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. సూర్యాపేట నుంచి అధికార పార్టీ అభ్యర్థి, మంత్రి జగదీష్‌రెడ్డి నామినేషన్‌ వేయనున్నారు.

అదే విధంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కూడా నామినేషన్‌ వేయనున్నారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి నోముల భగత్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి కుందూరు జయవీర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి కంకణాల నివేదితారెడ్డి కూడా గురువారం నామినేషన్లు వేయనున్నారు. కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థులు పద్మావతి, తుంగతుర్తిలో బీఆర్‌ఎస్‌ గాదరి కిషోర్‌కుమార్‌, బీజేపీ అభ్యర్థి కడియం రామచంద్రయ్య నామినేషన్లు వేయనున్నారు.

మునుగోడు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కె.ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి నామినేషన్లు వేయనున్నారు. భువనగిరిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి నామినేషను వేయనుండగా, నకిరేకల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి వేముల వీరేశం, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య కూడా గురువారం నామినేషన్లు వేయనున్నారు. మిర్యాలగూడలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు, కాంగ్రెస్‌ పార్టీ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి , సీపీఎం నుంచి జూలకంటి రంగారెడ్డి , బీజేపీ నుంచి సాధినేని శ్రీనివాసరావు నామినేషన్‌ సమర్పించనున్నారు.

హుజూర్‌నగర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి నామినేషన్‌ సమర్పించనున్నారు. దేవరకొండ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌, బీజేపీ అభ్యర్థి కేతావత్‌ లాలు నాయక్‌ నామినేషన్లు వేయనున్నారు. ఆలేరు నియోజక వర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గొంగిడి సునితతో పాటు కాంగ్రెస్‌ అభ్యర్థి బీర్ల ఐలయ్య నామినేషన్లు సమర్పించనున్నారు. ప్రధాన పార్టీ అభ్యర్థులంతా గురువారమే నామినేషన్లు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. నామినేషన్లు చివరి రోజు శనివారం తక్కువగానే దాఖలు కానున్నాయి.

 

మరిన్ని వార్తలు