రోడ్డు ప్రమాదంలో తల్లీకుమారుడి దుర్మరణం

11 Nov, 2023 02:02 IST|Sakshi

హాలియా : రోడ్డు ప్రమాదంలో తల్లీకుమారుడు దుర్మరణం చెందగా తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన అనుముల మండలంలోని పంగవానికుంట గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.త్రిపురారం మండలంలోని మునగబాయిగూడెం గ్రామానికి చెందిన గుండెబోయిన మహేష్‌ తన భార్య శైలజ, ఏడాదిన్నర వయసు గల కుమారుడు సందీప్‌తో కలిసి బైక్‌పై అనుముల మండలంలోని పంగవానికుంట గ్రామంలో అత్తగారింటికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో శుక్రవారం రాత్రి బైక్‌పై స్వగ్రామైన మునగబాయిగూడెం బయలుదేరారు. మార్గమధ్యలో పంగవానికుంట గ్రామ శివారులో రోడ్డుపై వెళ్తున్న వీరి ద్విచక్రవాహనాన్ని హాలియా నుంచి సాగర్‌ వైపు వెళ్తున్న కారు ఎదురుగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడాదిన్నర బాలుడు గుండెబోయిన సందీప్‌తో పాటు భార్య,భర్తలు గుండెబోయిన మహేష్‌, శైలజకి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి గుండెబోయిన శైలజ(23), ఏడాదిన్నర కుమారుడు సందీప్‌ను 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. గాయపడిన గుండెబోయిన మహేష్‌ను చికిత్స నిమిత్తం సాగర్‌ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి

రామగిరి(నల్లగొండ) : రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన తిప్పర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్‌ మండలంలోని గోరెంకలపల్లి గ్రామానికి చెందిన ఉప్పునూతల వెంకన్న(47) గత నెల 17న తన ద్విచక్రవాహనంపై నల్లగొండ నుంచి తిప్పర్తి వైపు వెళ్తుండగా మల్లేపల్లివారిగూడెం సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం నల్లగొండకు తరలించారు. అప్పటి నుంచి నల్లగొండలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. శుక్రవారం మృతుడి బావమరిది కొమ్మనబోయిన శంకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎన్‌.ధర్మా తెలిపారు.

మరిన్ని వార్తలు