ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి

11 Nov, 2023 02:02 IST|Sakshi
సుందరమూర్తి (ఫైల్‌)

పెద్దవూర : రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని వెనుకనుంచి ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు రాష్ట్రంలోని వెలసండూర్‌ మండలం బడ్డనగాంపట్టి గ్రామానికి చెందిన కలియప్పన్‌ సుందరమూర్తి(40) రెండు సంవత్సరాలుగా మండల కేంద్రంలోని బోగ్‌ మల్లా కాటన్‌ ఇండస్ట్రీలో మిషన్‌ ఆపరేటర్‌గా పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. గురువారం రాత్రి సుందరమూర్తి ఇండస్ట్రీలో పని ముగించుకుని మిల్లు నుంచి తన స్నేహితులతో కలిసి నడుచుకుంటూ మండల కేంద్రానికి కిరాణ సామగ్రి కోసం వచ్చారు. సామాన్లు తీసుకుని తిరిగి జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై నడుచుకుంటూ మిల్లు వద్దకు వెళ్తుండగా పీఏపల్లి మండలం వద్దిపట్ల గ్రామానికి చెందిన పుట్టపాక ఏడుకొండలు తన ద్విచక్రవాహనాన్ని అజాగ్రత్తగా, అతివేగంగా నడుపుతూ వచ్చి సుందరమూర్తిని వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. దీంతో సుందరమూర్తి తలకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే చికిత్స నిమిత్తం 108 వాహనంలో నాగార్జునసాగర్‌ కమలానెహ్రూ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మృతిచెందాడు. మృతుడు అవివాహితుడని, తల్లిదండ్రులు కూడా లేరని తెలిసింది. మృతుడి స్నేహితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అజ్మీరా రమేష్‌ తెలిపారు.

రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

బీబీనగర్‌: రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన బీబీనగర్‌ మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. భువనగిరి రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ కృష్ణారావు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 45నుంచి 50సంవత్సరాలు కలిగి ఉన్న వ్యక్తి కిలో మీటర్‌ 226 ఎగువ లైన్‌ వద్ద గుర్తుతెలియని రైలు కింద పడి మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించి భద్రపరిచినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు