పోలీసులకు పట్టుబడిన దొంగ

14 Nov, 2023 01:52 IST|Sakshi

చౌటుప్పల్‌: పట్టణ కేంద్రంలోని విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై వలిగొండ క్రాస్‌ రోడ్డు వద్ద సోమవారం పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. ఓ దొంగ పట్టుబడ్డాడు. సీఐ ఎస్‌. దేవేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం... మోత్కూర్‌లోని పోతాయిగడ్డ కాలనీకి చెందిన సిరిగిరి సాయిబాబా గ్యాస్‌ స్టౌవ్‌లు రిపేర్‌ చేస్తూ జీవనం సాగించేవాడు. అతడికి వివాహం జరిగి పిల్లలు జన్మించిన తర్వాత కిడ్నీ వ్యాధికి గురయ్యాడు. కిడ్నీ ఆపరేషన్‌ కోసం లక్షల రూపాయలు వెచ్చించి అప్పులపాలయ్యాడు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో జనగామ, సూర్యాపేట, నేరేడుచర్ల, సిద్దిపేట, కోరుట్ల, పాలకుర్తి, చౌటుప్పల్‌ ప్రాంతాల్లో పదుల సంఖ్యలో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఆయా కేసుల్లో అరెస్టు అయ్యి జైలుకు సైతం వెళ్లి వచ్చాడు. ఇటీవల తాజాగా చౌటుప్పల్‌, ఐనవోలు, ఆత్మకూర్‌, దేవరకొండ, బొమ్మలపురం, రామన్నపేట పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో దొంగతనాలు చేశాడు. బంగారు, వెండి ఆభరణాల్లో కొన్నింటిని విక్రయించి జల్సాలకు పాల్పడ్డాడు. మిగిలిన ఆభరణాలను ఎక్కడైనా విక్రయించాలన్న ఆలోచనతో దేవరకొండలో దొంగతనం చేసిన బైక్‌పై హైదరాబాద్‌కు బయల్దేరాడు. ఈ క్రమంలో చౌటుప్పల్‌ పట్టణ పరిధిలోని వలిగొండ క్రాస్‌ రోడ్డు వద్ద విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా వారికి చిక్కాడు. సాయిబాబాను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాల చరిత్ర వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై గతంలో వివిధ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో 19 కేసులు ఉన్నాయి. అతడి నుంచి 7.1తులాల విలువైన బంగారు ఆభరణాలు, 63తులాల వెండి ఆభరణాలు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కోర్టులో రిమాండ్‌ చేసి అనంతరం జైలుకు తరలించారు. ఎస్‌ఐ యాదగిరి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

7.1 తులాల బంగారు, 63తులాల

వెండి ఆభరణాలు, బైక్‌ స్వాధీనం

మరిన్ని వార్తలు