మాజీ మంత్రి జానారెడ్డి నామినేషన్లు తిరస్కరణ

14 Nov, 2023 08:09 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల పరిధిలో నామినేషన్ల పరిశీలన (స్క్రూట్నీ) సోమవారం పూర్తయింది. ఈ నెల 10వ తేదీ వరకు మొత్తం 428 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. వాటిలో 73 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 355 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఎన్నికల అధికారులు ఓకే చెప్పారు. అత్యధికంగా తుంగతుర్తి, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో నామినేషన్లు తిరస్కరణకు గురికాగా.. మునుగోడులో మాత్రం ఒక్క నామినేషన్‌ మాత్రమే తిరస్కరణకు గురైంది.

నామినేషన్లను ఆయా నియోజకవర్గాల్లో రిటర్నింగ్‌ అధికారులు నిశితంగా పరిశీలించి.. సరిగా లేనివాటిని తిరస్కరించారు. తిరస్కరణకు గురైన వాటిలో మాజీ మంత్రులు జానారెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు నామినేషన్లు ఉన్నాయి. వారితో పాటు పలువురు స్వతంత్రుల నామినేషన్లు ఉన్నాయి. ఇక ఈనెల 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువుగా ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. ఆ తర్వాత బరిలో ఉండేది ఎంతమంది అనే విషయం తేలనుంది.

తిరస్కరణకు గురైన నామినేషన్లు ఇవీ..

నల్లగొండ నియోజకవర్గంలో 39మంది నామినేషన్లు వేయగా అందులో ముగ్గురి నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు.

నకిరేకల్‌లో 33 మంది అభ్యర్థులకుగాను ఇద్దరి నామినేషన్లు తిరస్కరించారు.

మునుగోడులో 51 మంది నామినేషన్లు దాఖలు చేయగా అందులో ఒక్కరి నామినేషన్‌ను తిరస్కరించారు.

దేవరకొండలో 18 మంది నామినేషన్లు వేయగా ఐదుగురివి తిరస్కరణకు గురయ్యాయి.

► మిర్యాలగూడ నియోజకవర్గంలో 45 మంది నామినేషన్లు వేయగా, అందులో 12 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు.

నాగార్జునసాగర్‌లో 28 నామినేషన్లకు గాను ఏడుగురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. ఇందులో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ప్రపోజర్స్‌ సంతకాలు సరిపడా చేయించకపోవడంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇద్దరు ప్రపోజర్స్‌ సంతకాలు చేయాల్సి ఉండగా.. కేవలం ఒక్కరే చేశారు.

సూర్యాపేట నియోజకవర్గంలో 42 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, 10 మంది అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు.

► తుంగతుర్తి నియోజకవర్గంలో 33 మంది నామినేషన్లు వేయగా, అందులో 12 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. కాంగ్రెస్‌ పార్టీ తరపున నామినేషన్‌ దాఖలు చేసిన మోత్కుపల్లి నర్సింహులు అఫిడవిట్‌ సమర్పించకపోవడంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు.

హుజూర్‌నగర్‌లో 40 మంది నామినేషన్లను దాఖలు చేయగా, ఐదుగురి నామినేషన్లను తిరస్కరించారు.

కోదాడ నియోజకవర్గంలో 39 మంది నామినేషన్లు దాఖలు చేయగా, ముగ్గురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

ఆలేరు నియోజకవర్గంలో 31 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. 9 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

భువనగిరిలో 29 మంది నామినేషన్లు వేయగా నలుగురి నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు.

రేపటి వరకు ఉపసంహరణ
నామినేషన్లు ఉపసంహరించుకోవడాని మంగళ, బుధవారాల్లో అవకాశం కల్పించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రధాన పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడ్డ నాయకులు కొందరు బరిలో నిలిచేందుకు స్వతంత్రంగా నామినేషన్లు వేశారు. వారిని బుజ్జగించే పనిలో ముఖ్య నాయకులు ఉన్నారు. స్వతంత్రులను కూడా తమవైపునకు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. బుధవారం సాయంత్రానికి ఉపసంహరణ ప్రక్రియ ముగిసి బరిలో ఉండే అభ్యర్థులు ఎవరో తేలనున్నారు.

మరిన్ని వార్తలు