నేడు వీరాచార విన్యాసాలు..

21 Mar, 2023 01:18 IST|Sakshi
ఆలయ ప్రదక్షిణలో ఆదిదంపతులు (ఇన్‌సెట్లో) మహాదుర్గ అలంకారంలో శ్రీశైల భ్రామరి

ఉగాది మహోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రభోత్సవం నిర్వహిస్తారు. అలాగే స్వామిఅమ్మవార్లకు నందివాహనసేవ, శ్రీభ్రమరాంబాదేవికి మహా సరస్వతి అలంకార సేవ నిర్వహిస్తారు. రాత్రి 10 గంటలకు వీరశైవుల వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం చేస్తారు. శివదీక్షా శిబిరాల వద్ద నిర్వహించే వీరచార విన్యాసాల కార్యక్రమానికి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేయగా, పోలీసు శాఖ పటిష్టబందోబస్త్‌ చేపట్టారు.

ఇలకై లాసం..

భక్తజన సంద్రం

ఇల కైలాసమైన శ్రీశైల మహాక్షేత్రం భక్తజన సంద్రంగా మారుతోంది. ఎండను సైతం లెక్కచేయకుండా నల్లమల అడవుల్లో పాదయాత్రగా లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. క్షేత్ర వీధులు భక్తులతో పోటెత్తాయి. తప్పెట దరువులతో, రంగులు చల్లుకుంటూ, చిందులు వేస్తూ శ్రీశైలం చేరుకుని ‘మల్లన్న..నీ దర్శనానికి వచ్చాం..అంటూ మనసారా స్మరించుకుంటున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామిఅమ్మవార్ల దర్శనానికి బారులుదీరుతున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ఆలయ పూజా వేళలను మార్పులు చేసి వేకువజాము నుంచే దర్శనానికి అనుమతిస్తున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి. భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించడంలో భాగంగా మల్లన్న అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు.

శ్రీశైలంలో మిన్నంటిన

ఉగాది ఉత్సవాలు

మహాదుర్గ అలంకారంలో

దర్శనమిచ్చిన భ్రమరాంబ

కనులపండువగా కై లాసవాహన సేవ

కన్నడిగులతో పోటెత్తిన శ్రీగిరి వీధులు

శ్రీశైలంటెంపుల్‌: అష్టభుజాలతో శంఖం, చక్రం, గద, పద్మం, త్రిశూలం, ఖడ్గం ధరించి మహాదుర్గ అలంకారంలో భ్రమరాంబదేవి భక్తులకు అభయమిచ్చారు. కనులారా దర్శించుకున్న భక్తులు శుభములివ్వు తల్లీ అంటూ ప్రణమిల్లారు. శ్రీశైల క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు సోమవారం అమ్మవారు మహాదుర్గ అలంకారంలో భక్తులను కటాక్షించారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం చండీశ్వరపూజ, మండపారాధన, లోకకల్యాణం కోసం జపానుష్ఠానాలు నిర్వహించారు. 9 గంటలకు స్వామివారి యాగశాలలో రుద్రహోమం, అమ్మవారి యాగశాలలో చండీహోమం నిర్వహించారు. అమ్మవారికి విశేష కుంకుమార్చన, నవావరణార్చనలు, సాయంత్రం జపానుష్ఠానములు జరిపించారు. అనంతరం ఉభయ దేవాలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో కై లాస వాహనాన్ని అధిష్టించిన స్వామిఅమ్మవార్లకు అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాదుర్గ అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారికి ప్రత్యేక హారతులిచ్చారు. మహాదుర్గగా అలంకీకృతులైన భ్రమరాంబాదేవిని, కైలాస వాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను ఆలయ ప్రదక్షిణ నిర్వహించి రాజగోపురం మీదుగా క్షేత్రప్రధాన వీధుల్లోకి తోడ్కొనివచ్చారు. అనంతరం గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు అక్కడి నుంచి బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం కొనసాగింది. ఉత్సవంలో కోలాటం, చెక్కభజన, పగటి వేషాల ప్రదర్శన, బుట్టబొమ్మలు, గొరవయ్యల నృత్యం, తప్పెట్లు, కొమ్మువాయిద్యాలు, జానపదడోలు, నందికోలు నృత్యాలు ఆకట్టుకున్నాయి. కన్నడ భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకుని నీరాజనాలు సమ ర్పించారు. పూజా కార్యక్రమాల్లో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎస్‌.లవన్న దంపతులు, ఏఈవోలు హరిదాసు, ఫణిధరప్రసాద్‌, అర్చకులు, వేదపండితులు, అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు