స్వచ్ఛత మహిళా అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

21 Mar, 2023 01:18 IST|Sakshi
స్టాల్స్‌ను ప్రారంభిస్తున్న జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ శామూన్‌

నంద్యాల(సిటీ): నంద్యాల మున్సిపల్‌ పరిధిలో విధులు నిర్వహిస్తూ పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణలో ప్రతిభ చూపిన మహిళల నుంచి ఉమెన్‌ ఐకాన్‌ లీడింగ్‌ స్వచ్ఛత–2023 పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ రవిచంద్రారెడ్డి సోమ వారం ఓ ప్రకటనలో తెలిపారు. వ్యక్తిగత, స్వయం సహాయక, చిన్న, తరహా, సామాజిక మరుగుదొడ్ల నిర్వహణ, సెప్టిక్‌ ట్యాంకుల శుభ్రత, వ్యర్థాల శుద్ధీకరణ, చెత్త సేకరణ, తడ్తి, పొడి చెత్తలతో కంపోస్టు తయారీ తదితర విభాగాల్లో అవార్డులు అందించనున్నామన్నా రు. ఆసక్తి కలిగిన మహిళలు ఈ నెల 23వ తేదీలోగా నంద్యాల మున్సిపల్‌ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఎంపికై న వారికి జూన్‌ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో పురస్కారాలను అందజేస్తామన్నారు.

ఇంటర్‌ పరీక్షలకు

1,462 మంది గైర్హాజరు

నంద్యాల(సిటీ): ఉమ్మడి కర్నూలు జిల్లాలోఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలకు 1,462 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆర్‌ఐఓ గురువయ్యశెట్టి సోమవారం తెలిపారు. పార్ట్‌–3 లో మ్యాథమ్యాటిక్స్‌ పేపర్‌–1ఏ, బోటనీ పేపర్‌–1, సివిక్స్‌ పేపర్‌–1 పరీక్షలను కర్నూలు, నంద్యాల జిల్లాలలో 38,378 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా 36,916 మంది హాజరయ్యారు. జనరల్‌ ఇంటర్‌ విద్యార్థులు 1,261 మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 201 మంది గైర్హాజరయ్యారు.

బేతంచెర్లకు పాలిటెక్నిక్‌

కళాశాల మంజూరు

బేతంచెర్ల: మండలానికి పాలిటెక్నిక్‌ కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ సోమవారం గెజిట్‌ విడుదల చేశారు. నంద్యాల జిల్లాలోని బేతంచెర్ల, అనంతపురం జిల్లా గుంతకల్‌, వైఎస్సార్‌ జిల్లాలో మైదుకూర్‌లో పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటుకు గతంలోనే గోరుమానుకొండ గ్రామ సమీపంలో మోడల్‌ స్కూలు పక్కన్న సుమారు 4 ఎకరాల స్థలాన్ని జిల్లా అధికారులు కేటాయించారు. యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు అవసరమైన సాంకేతిక విద్యను అందించే పాలిటెక్నిక్‌ కళాశాల మంజూరు కావడం పట్ల ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రూ.30 కోట్లతో ఈ కళాశాల ఏర్పాటుకానుందన్నారు. జిల్లా యువత తరఫున మంత్రి బుగ్గన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతానికి పాలిటెక్నిక్‌ కళాశాల మంజూరు కావడంతో ఎంతో మంది యువత స్థానికంగానే డిప్లొమా కోర్సులు చేసే అవకాశంలభించందన్నారు.

సిరిధాన్యాలతో

ఆరోగ్య సంరక్షణ

జిల్లా కలెక్టర్‌

మనజీర్‌ జిలానీ శామూన్‌

నంద్యాల: అత్యధిక పోషకాలు ఉన్న సిరి ధాన్యాలను ఆహారంగా తీసుకోవడంతో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చని జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ శామూన్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయ చిరుధాన్యాల మహోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్ర, ఐసీడీఎస్‌ తదితర శాఖల సహకారంతో సోమవారం నంద్యాల కలెక్టరేట్‌లోని వైఎస్‌ఆర్‌ సెంటినరీ హాల్‌ ప్రాంగణంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సిరిధాన్యాల స్టాళ్లను జిల్లా కలెక్టర్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అతి తక్కువ నీరు, తక్కువ ఖర్చుతో చేసే సిరిధాన్యాల సాగుపై రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయిలోనే కాకుండా మండల స్థాయిలో కూడా చిరు ధాన్యాల ఉత్పత్తులపై స్టాళ్లు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు. కల్తీ ఆహార పదార్థాలు తీసుకోకుండా అధిక పోషకాలు ఉండే చిరుధ్యానాలను ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నా రు. జిల్లాలో సిరిధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు కృషి చేయాలన్నారు. అంతకు ముందు మహిళా సంఘాలు తయారు చేసిన పది రకాల సిరి ధాన్యాల ఆహార పదార్థాలను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ పుల్లయ్య, డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి జయదేవ్‌, జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, ఉద్యాన శాఖ అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు