వినూత్న ప్రయత్నం..అద్భుత ఫలితం

22 Mar, 2023 02:30 IST|Sakshi
ఆముదం పంట పొలంలో దిబ్బమడుగు మద్దయ్య

కర్నూలు(అగ్రికల్చర్‌): ఆయన 7వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. వ్యవసాయంలో విశేషమైన ప్రతిభ కనబరిచారు. ఆముదంలో తక్కువ ఖర్చుతో గణనీయమైన దిగుబడులు సాధించి రాష్ట్రస్థాయి ఉగాది పురస్కారానికి ఎంపికయ్యాడు దిబ్బ మడుగు మద్దయ్య. ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లి పంచాయతీలోని చెన్నంచెట్టిపల్లి గ్రామానికి చెందిన ఈయన ఏటా వేరుశనగ,కంది, పత్తి వంటి పంటలు సాగు చేసేవారు. ఈ పంటలు కలసిరాకపోవడంతో వినూత్నంగా ఆలోచించాడు. మార్కెట్‌లో ఎటువంటి పంటలకు డిమాండ్‌ ఉందో తెలుసుకున్నాడు. ఆముదంలో సరికొత్త వంగడాలైన హైబ్రిడ్‌ రకాలను ఎంపిక చేసుకుని 2022–23లో పంట సాగు చేశాడు. సమగ్ర సస్యరక్షణ, సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు పాటించారు. ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పెట్టుబడి పెట్టారు. సాధారణంగా ఎకరాకు 5–6 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఈయన మాత్రం తక్కువ ఖర్చుతో రికార్డు స్థాయి దిగుబడులు సాధించారు. ఎకరాకు 8–10 క్వింటాళ్ల దిగుబడి సాధించడం విశేషం. ఆచార్య ఎన్‌జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ విష్ణువర్దన్‌రెడ్డి పంట పొలాన్ని పరిశీలించారు. సాగు పద్ధతులను తెలుసుకుని ఆశ్చర్యపోయారు. తర్వాత వ్యవసాయ శాస్త్రవేత్తల సలహా మేరకు మద్దయ్య ఉగాది పురస్కారానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఇటీవల గుంటూరులోని ఆచా ర్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాల యం నుంచి పురస్కారానికి ఎంపికై నట్లు సమాచారం అందింది. దీంతో నేడు ఆ విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి చేతుల మీదుగా ఉగాది పురస్కారం, రూ.5వేలు నగదు బహుమతి అందుకోనున్నారు. ఆరుపదులకుపైగా వయస్సులో మద్దయ్య వ్యవసాయం చేస్తూ ఉత్తమ రైతుగా ఉగాది పురస్కారం అందుకుంటుండటంపై సర్వత్రా అభినందనలు వ్యక్తమవుతున్నాయి.

ఆముదం సాగులో దిబ్బమడుగు మద్దయ్య రాణింపు

ఉత్తమ రైతుగా ఉగాది పురస్కారానికి ఎంపిక

మరిన్ని వార్తలు