ఏపీడబ్ల్యూజేఎఫ్‌ డైరీ ఆవిష్కరణ

22 Mar, 2023 02:30 IST|Sakshi
ఏపీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర డైరీని ఆవిష్కరిస్తున్న ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌

కర్నూలు: శోభకృత్‌ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ (ఏపీడబ్ల్యూజేఎఫ్‌) డైరీని మంగళవారం ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌, గీతాంజలి నర్సింగ్‌ కళాశాలల అధినేత పెరుగు విజయవర్ధన్‌రెడ్డి ఆవిష్కరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ జర్నలిస్టులందరూ ఐక్యతతో ఉండటం శుభపరిణామన్నారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమన్నారు. ఏవైనా సమస్యలుంటే వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. అలాగే ఎప్పుడూ పోలీసు సహాయ సహకారాలు ఉంటాయన్నారు. అనంతరం జర్నలిస్టు మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి, జిల్లా అధ్యక్షుడు కె.బి.శ్రీనివాసులు, ఫొటోగ్రాఫర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షుడు డి.హుసేన్‌, శ్రీనివాసులు, జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి రామాంజనేయులు, ఉపాధ్యక్షులు బసప్ప, చంద్రమోహన్‌, నగర అధ్యక్ష, కార్యదర్శులు శివకుమార్‌, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

వినియోగదారులను జాగృతం చేయండి

కర్నూలు(లీగల్‌): వినియోగదారులకు వారికున్న హక్కులపై జాగృతం చేయాలని న్యాయ విద్యార్థులకు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ సూచించింది. కోర్టు అబ్జర్వేషన్‌లో భాగంగా మంగళవారం ప్రసూనా న్యాయ కళాశాల డీన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జేపీ శివకుమార్‌ నేతృత్వంలో ఎల్‌ఎల్‌బీ ఫైనల్‌ విద్యార్థులు దాదాపు 150 మంది కమిషన్‌ను సందర్శించారు. తమకు జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేయడంతో పాటు తమ పరిసరాల్లోని వారు కూడా అన్యాయానికి గురికాకుండా చూడాల్సిన బాధ్యత న్యాయ విద్యార్థులపై ఉందని ప్రొఫెసర్‌ శివకుమార్‌ పేర్కొన్నారు. వినియోగదారులు అసౌకర్యానికి, సేవాలోపానికి, దోపిడీకి గురైనప్పుడు కమిషన్‌ను ఆశ్రయించి న్యాయం పొందవచ్చని ‘ప్రసూనా’ పూర్వ విద్యార్థి, కమిషన్‌ అధ్యక్షుడు కె.కిషోర్‌ కుమార్‌ సూచించారు. షాపింగ్‌ మాల్స్‌లో క్యారీ బ్యాగ్‌కు, సినిమా థియేటర్స్‌లో పార్కింగ్‌ను రుసుం వసూలు చేయడం చట్టవిరుద్ధమని ప్రసూనా కళాశాల పూర్వ అధ్యాపకులు, కమిషన్‌ సభ్యుడు ఎన్‌.నారాయణరెడ్డి పేర్కొన్నారు. వినియోగదారులు తమ సమస్యపై కమిషన్‌లో నేరుగా ఫిర్యాదు చేయడంతో పాటు వాదనలు వినిపించుకుని న్యాయం పొందవచ్చని కమిషన్‌ సభ్యులు నజీమా కౌసర్‌ సూచించారు. కార్యక్రమంలో ప్రసూనా న్యాయ కళాశాల అధ్యాపకులు మొఫూజ్‌ పాషా, మహమ్మద్‌ హుసేన్‌ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు