● .....

23 Mar, 2023 01:10 IST|Sakshi
అశేష భక్తజనం మధ్య శ్రీశైల పురవీధుల్లో సాగుతున్న మల్లన్న రథోత్సవం

కనుల పండువగా

స్వామి అమ్మవార్ల రథోత్సవం

పోటెత్తిన కన్నడిగులు..

మార్మోగిన ఓంకార నాదం

రమావాణీ సేవిత రాజరాజేశ్వరిగా

అమ్మవారు దర్శనం

నేటి పూర్ణాహుతితో ముగియనున్న

ఉగాది ఉత్సవాలు

శ్రీశైలం టెంపుల్‌: ఇల కై లాసం శ్రీగిరిలో ఓంకారనాదం మార్మోగింది. మల్లన్న వైభవాన్ని చూసి భక్తులు పరవశించిపోగా శ్రీభ్రమరాంబాదేవి రమావాణి సేవిత రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉగాది ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం స్వామి, అమ్మవార్ల రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ముందుగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తులను పల్లకీలో ఆశీనులు చేసి ఊరేగింపుగా రథశాల వద్దకు తీసుకెళ్లి రథంపై అధిష్టింపజేశారు. అనంతరం స్థానాచార్యులు రథాంగపూజ, రథాంగహోమం, రథాంగబలి నిర్వహించారు. అర్చకులు ఉత్సవ మూర్తులకు ప్రత్యేక హారతులిచ్చారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎస్‌.లవన్న, అధికారులు రథానికి కూష్మాండబలి సమర్పించారు. అనంతరం రథానికి ప్రత్యేక హారతి ఇచ్చి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలో లక్షలాది మంది కన్నడ భక్తులు పాల్గొని సిరిగిరి మల్లయ్య.. మహాత్మ మల్లయ్య..అని కొనియాడుతూ ఓంకారనాద ధ్వనుల మధ్య రథంపైకి అరటిపండ్లు, ఖర్జూరాలు, కలకండ విసిరి భక్తి చాటుకున్నారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని పరవశించిపోయారు. గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు సాగిన ఈ రథోత్సవంలో కర్ణాటక జాంజ్‌, వీరగాసీ, కన్నడ జానపదడోలు, కోలాటం, చెక్కభజన, పగటి వేషాల ప్రదర్శన, బుట్టబొమ్మలు, గొరవయ్యల నృత్యం, తప్పెట్లు, కొమ్ము వాయిద్యాలు, నందికోలు నృత్యాలు అలరించాయి. కాగా రథోత్సవ దర్శనం ద్వారా సర్వపాపాలు తొలగిపోతాయని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.

నేడు ఉగాది ఉత్సవాలకు పూర్ణాహుతి

మార్చి 19వ తేదీ నుంచి ప్రారంభమైన ఉగాది మహోత్సవాలకు గురువారం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించనున్నారు. అమ్మవారికి భ్రమరాంబాదేవి నిజాలంకరణ, స్వామిఅమ్మవార్లకు అశ్వవాహనసేవ, ఆలయ ఉత్సవం నిర్వహిస్తారు. దీంతో ఉగాది మహోత్సవాలు ముగుస్తాయి.

స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో తీసుకెళ్తున్న ఈఓ, జగద్గురుపీఠాఽధిపతి, అర్చకులు

రథంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులు

కోర్కెలు తీర్చే రమావాణీసేవిత రాజరాజేశ్వరి

ఉగాది మహోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శ్రీభ్రమరాంబాదేవి రమావాణిసేవిత రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు కటాక్షించింది. చతుర్భుజాలు కలిగిన ఈ దేవి పాశం, అంకుశం, పద్మం, చెరకుగడను ధరించి దర్శనం ఇచ్చారు. ఈ దేవిని దర్శించడం వలన కోరిన కొర్కెలు నెరవేరుతాయని, సమస్యలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

మరిన్ని వార్తలు