సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి

23 Mar, 2023 01:10 IST|Sakshi
అర్చకుడు మురళీకృష్ణ శర్మకు ఉగాది పురస్కారం అందజేస్తున్న కలెక్టర్‌, జెడ్పీచైర్మన్‌

ఉగాది వేడుకల్లో జెడ్పీ చైర్మన్‌,

జిల్లా కలెక్టర్‌

అర్చకులకు పురస్కారాలు అందజేత

నంద్యాల: శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో వెలుగొందాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎరబ్రోతుల పాపిరెడ్డి, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ శామూన్‌ ఆకాంక్షించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో దేవదాయ ధర్మదాయ శాఖ, పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో నంద్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మాబున్నిసా, డీఆర్‌ఓ పుల్లయ్య, డీసీఎంఎస్‌ చైర్మన్‌ సి.హెచ్‌. శిరోమణి మద్దయ్య, రాష్ట్ర హస్తకళల డైరెక్టర్‌ సునీత అమృతరాజ్‌, దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ సుధాకర్‌ రెడ్డి, జిల్లా పర్యాటక అధికారి సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. వేడుకల్లో తొలుత కరణం సుధీంద్ర ఆచారి శాస్త్రోక్తంగా గణపతి పూజ చేసి పంచాంగ శ్రవణం నిర్వహించారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

అర్చకులకు ఉగాది పురస్కారాలు ప్రదానం

దేవదాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన కోటపాడు గ్రామ శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయ అర్చకుడు శ్రీనివాసులు, నంద్యాల పట్టణంలోని శ్రీ బ్రహ్మానందీశ్వర స్వామి దేవాలయ అర్చకుడు రాచకొండ మురళీకృష్ణ శర్మ, నొస్సం గ్రామ శ్రీ బుగ్గ వెంకటేశ్వర రామలింగేశ్వర స్వామి ఆలయ అర్చకుడు పెట్టిన కోట శ్రీకాంత్‌ శర్మలకు ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు. ఒక్కొక్కరికి రూ.10,116 పారితోషికం, ప్రశంసా పత్రం, కండువాలను జిల్లా కలెక్టర్‌, జెడ్పీ చైర్మన్‌ అందజేసి ఘనంగా సత్కరించారు. వేడుకల్లో డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, మున్సిపల్‌ కమిషనర్‌ రవిచంద్రారెడ్డి, డీఎస్‌ఓ ఆచార్యులు, కలెక్టరేట్‌ ఏఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు