నో సెల్‌ఫోన్‌ జోన్లుగా ‘పది’ పరీక్ష కేంద్రాలు

23 Mar, 2023 01:10 IST|Sakshi

నంద్యాల సిటీ: పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది నందికొట్కూరు, కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె హైస్కూళ్లలో జరిగిన ఘటనల దృష్ట్యా ఈ ఏడాది ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలను నో సెల్‌ఫోన్‌ జోన్లుగా ప్రకటించారు. కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను నిషేధించారు. అదే విధంగా ప్రశ్నపత్రంలో ఏడు అంకెల ప్రత్యేక కోడ్‌ను ముద్రించారు. ఎక్కడైన ప్రశ్నపత్రం లీకేజీ అయినా.. ఆ పేపర్‌పై ఉన్న ఏడు అంకెల కోడ్‌ను బట్టి సులువుగా ఏ సెంటర్‌ నుంచి ప్రశ్నపత్రం బయటకు వచ్చిందో స్పష్టంగా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. పరీక్ష కేంద్రాలను ఇప్పటికే విద్యాశాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గదుల్లో లైటింగ్‌ ఉండేలా, ఫ్యాన్లు తిరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మన బడి నాడు–నేడు కింద రెండో విడతలో చేపట్టిన పనులు పూర్తి చేసేలా సమగ్ర శిక్ష విభాగం, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారు. సమస్యాత్మక పరీక్ష కేంద్రాల దగ్గర అదనపు పోలీస్‌ సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు.

125 కేంద్రాల్లో పరీక్షలు

వచ్చే నెల 3వ తేదీ నుంచి మొదలు కానున్న పదో తరగతి పరీక్షలకు నంద్యాల జిల్లాలో 125 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో బీ సెంటర్లు (పోలీసు స్టేషన్లకు 8 కి.మీ. లోపు ఉండేవి) 116, సీ సెంటర్లు (పోలీసు స్టేషన్లకు 8 కి.మీ.కు పైగా ఉన్నవి)9 ఉన్నాయి. ఈ కేంద్రాల్లో 456 ఉన్నత పాఠశాలలకు చెందిన 25,411 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల విధులు నిర్వహించేందుకు ముఖ్య పర్యవేక్షకులను, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లను, ఇన్విజిలేటర్లను నియమించారు. అలాగే 5 ప్లయింగ్‌ స్క్వాడ్‌ టీమ్‌లను ఏర్పాటు చేశారు.

ప్రశ్నపత్రాలపై ఏడు అంకెల కోడ్‌

జిల్లాలో 125 పరీక్ష కేంద్రాల ఎంపిక

పరీక్షలకు హాజరుకానున్న

25,411 మంది విద్యార్థులు

నేడు, రేపు జిల్లాకు టెన్త్‌ ప్రశ్నపత్రాలు

నేడు, రేపు జిల్లాకు ప్రశ్నపత్రాలు

పదో తరగతి ప్రశ్నపత్రాలు నేడు, రేపు జిల్లాకు రానున్నాయి. నేడు(గురువారం) మొదటగా సెట్‌–1, రేపు(శుక్రవారం)రెండో సెట్‌ ప్రశ్నపత్రాలు రానున్నాయి. వీటిని జిల్లాలో ఎంపిక చేసిన స్టోరేజీ పాయింట్లకు చేర్చి అక్కడ భద్రపరచనున్నారు. ఇందుకు నిర్దేశించిన రూట్లకు ఆఫీసర్లను సైతం ఎంపిక చేశారు.

మరిన్ని వార్తలు