పనుల్లో నాణ్యతలోపించొద్దు

11 Mar, 2023 09:28 IST|Sakshi

ధన్వాడ: మండలంలోని కిష్టాపూర్‌ ప్రాథమిక పాఠశాలను శుక్రవారం సెక్టోరియల్‌ అధికారి శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో కొనసాగుతున్న మన ఊరు – మన బడి పనులను పరిశీలించారు. నాణ్యత లోపించకుండా పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమై ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమాల కొనసాగింపు, చదువులో వెనుకబడిన విద్యార్థుల ప్రగతికి తీసుకుంటున్న చర్యల గు రించి ఆరాతీశారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయుడు అఖిల్‌, బాషా, సీఆర్పీ వెంకట్రాములు, ఐఆర్పీ మాసన్న ఉన్నారు.

ఔషధదుకాణాల తనిఖీ

మరికల్‌: మండల కేంద్రంలోని ఔషధ దుకాణాలను శుక్రవారం సాయంత్రం ఉమ్మడి జిల్లా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ రబియాషేక్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎంబీబీఎస్‌ వైద్యులు రాసిచ్చిన చీటీలకే మందులు ఇవ్వాలని.. నిబంధనలు అతిక్రమిస్తే దుకాణాలను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. దుకాణాల నిర్వహణకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

డ్రైవర్లు అప్రమత్తంగాఉండాలి

నారాయణపేట రూరల్‌: పోలీసు వాహన డ్రైవర్లు డ్రైవింగ్‌లో అప్రమత్తంగా వ్యవహరించాలని ఎంటీఓ ఆర్‌ఐ కృష్ణయ్య కోరారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం పోలీసు వాహన డ్రైవర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెట్రోలింగ్‌ సిబ్బంది నిరంతరం కేటాయించిన ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తుండాలని, వాహనానికి జీపీఎస్‌ ఉంటుందని చెప్పారు. కంప్యూటర్‌లో వాహన రూట్‌లను తనిఖీ చేస్తారని.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనాన్ని రోజూ శుభ్రం చేయాలని, కండీషనల్‌లో ఉండేలా చూసుకోవాలన్నారు. డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్‌ ధరించాలని, వాహనానికి సంబంధించిన మెకానిజం తెలుసుకొని ఉండాలని సూచించారు. సమావేశంలో ఐటీకోర్‌ శ్రీనివాసులు, రమేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

గుట్టుగా బాల్యవివాహం

కలెక్టర్‌ ఆదేశాలతో సఖి కేంద్రానికి బాలిక తరలింపు

ఊట్కూర్‌: బాల్య వివాహాల నియంత్రణకు అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా.. కొందరు వారి కన్నుగప్పి ఎక్కడో ఒకచోట జరిపిస్తూనే ఉన్నారు. మండలంలోని నిడుగుర్తిలో శుక్రవారం తెల్లవారుజామున బాల్యవివాహం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని ఓబ్లాపూర్‌కు చెందిన 16 ఏళ్ల బాలికకు నారాయణపేట మండలం సింగారం గ్రామానికి చెందిన యువకుడితో పెద్దలు గ్రామంలోని కాశిలింగం దేవాలయంలో వివాహం జరిపించారు. అనంతరం జాజాపూర్‌లోని బంధువుల ఇంటికి పంపించారు. ఈ విషయాన్ని కొందరు కలెక్టర్‌కు తెలియజేయగా ఆయన ఆదేశాల మేరకు ఐసీడీఎస్‌, బాలల సంరక్షణ అధికారులు పోలీసులతో కలిసి గ్రామంలో విచారణ చేపట్టారు. జాజాపూర్‌లోని బంధువుల ఇంటిలో ఉన్న విషయాన్ని తెలుసుకొని అక్కడకి వెళ్లి విచారించగా బాలిక వయసు తక్కువగా ఉందని నిర్ధారణ కావడంతో ఆమెను జిల్లాకేంద్రంలోని సఖి కేంద్రానికి తరలించారు. ఈ విషయమై డీసీపీఓ కుసుమలత మాట్లాడుతూ.. కలెక్టర్‌ ఆదేశాల మేరకు బాలికను సఖి కేంద్రానికి తరలించామని, విచారణ జరుపుతున్నామని వివరించారు. ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ అంజలి, బాలల సంరక్షణ అధికారులు శ్రవణ్‌, జిలాని, కార్తీక్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు