శోభకృత్‌కు స్వాగతం

22 Mar, 2023 01:36 IST|Sakshi

శుభాశుభ ఫలితాలు

తెలిపే పండుగ..

మనకు జ్యోతిష శాస్త్రరీత్య శుభాశుభ ఫలితాలను తెలిపే పండుగ ఉగాది. దీనినే సంవత్సరాది అని కూడా అంటారు. ఉదగా మొదలుకుని తెలుగు వారికి కొత్త పంచాగం ప్రారంభమవుతుంది. నిన్న మొన్నటి వరకు ఉన్న సంవత్సరం శుభకృత్‌ నామ సంవత్సరం ముగించుకొని శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. రైతులు, ఉద్యోగస్తులు కళాకారులు, వివిధ వృత్తుల రంగాలలో ఉండే వారంతా ఈ సంవత్సరం తమ రాశిఫలాలు, లేదా జన్మనామ నక్షత ఫలాలు ఏవిధంగా ఉన్నాయో పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకొని దాని అనుగుణంగా నడుచుకుంటారు.

నేడు ఉగాది

సాయంత్రం ఆలయాల్లో పంచాంగ శ్రవణం

జిల్లా కేంద్రంలో కొనుగోళ్ల సందడి

నారాయణపేట టౌన్‌: ఉగాది రోజు నుంచి తెలుగు సంవత్సరం మొదలవుతుంది. కాబట్టి ఇది తెలుగు వారి తొలిపండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభిచడం పరిపాటి. యుగాల ప్రారంభానికి సూచికగా ఉన్న యుగాది, కాలగమనంలో ఉగాదిగా రూపాంతరం చెందిందని పండితులు విశ్వసించారు. ఆ రోజు ఇళ్లు శుభ్రపర్చుకుని, గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు. నుతన వస్త్రాలు ధరించి ఉగాది పచ్చడి ఆరగిస్తారు. ఈ పచ్చడి ప్రకృతిలో నూతనత్వాన్ని ఆహ్వానించడానికి సూచికగా భావిస్తారు. రానున్న ఏడాదిలో ఎదురయ్యే మంచి, చెడును, కష్టసుఖాలను సమంగా స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం శోభకృత్‌ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఉగాది వేడుకలను జిల్లా వ్యాప్తంగా ప్రజలు నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలో రెండు రోజులుగా పండగ సందడి నెలకొంది. దుస్తులు, సరుకులు, మట్టికుండలు, పూలు వంటి వాటిని కొనుగోలుచేయడం కనిపించింది. కొందరు బంగారం కొనేందుకు ఆసక్తి చూపారు.

పంచాంగం అంటే..

తిథి, వారం నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు భాగాలను కలిపి పంచాంగం అంటారు. పాఢ్యమి నుంచి మొదలుకొని 15 తిథులు, 7 వారాలు, అశ్వని నుంచి రేవతి వరకు 27 నక్షత్రములు, విష్కభం నుంచి వైధతి వరకు 27 యోగములు, బవ నుంచి కింస్తుఘ్నం వరకు 11 కరణములు ఉన్నాయి. తిథి వలన సంపద, నక్షత్రం వల్ల పాప పరిహారం, సరైన యోగంతో వ్యాధి నివృత్తి, కరణం ద్వారా కార్యానుకూలతను పొందవచ్చు. అందుకే చేసే పనులలో అనుకూలతను జయాన్ని జయించేవారందరూ, కాలన్ని తెలిసి కర్మలు చేసే వారందరూ తప్పక పంచాంగం చూడాలని శాస్త్రం చెబుతుంది. ఉగాది రోజు పంచాంగ ఫలాలను తెలుసుకోవడం వల్ల భవిష్యత్‌ కార్యాచరణ చేపట్టవచ్చు. జిల్లావ్యాప్తంగా ఆలయాలలో సాయంత్రం పంచాంగ శ్రవణం చేయనున్నారు. ముందుగా దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకులు, పండితులు పంచాంగం చెబుతారు.

వ్యవసాయ పనులకు శ్రీకారం

ఉగాది పర్వదినాన్ని ప్రజలు కొత్త పనుల ప్రారంభానికి శుభదినంగా భావిస్తారు. ప్రధానంగా రైతులంతా ఉగాది రోజునే ఖరీఫ్‌ పనులకు శ్రీకారం చుడతారు. వ్యవసాయంలో ప్రధాన పాత్ర పోషించే పశువులకు ముకుతాడు వేయడం, భూమి పూజ చేసి అరక దున్నుతారు. పొలంలోని శమీ వృక్షానికి, వ్యవసాయ పరికరాలకు, ఎద్దులకు ప్రత్యేక పూజలు చేస్తారు. పెరుగన్నం నైవేద్యంగా సమర్పించి సూర్యోదయానికి ముందే ఈ తంతును ముగిస్తారు. అరక కట్టి ఐదుసార్లు దక్కి దున్నుతారు.

మరిన్ని వార్తలు