నిర్వాసితులను ఆదుకుంటాం

22 Mar, 2023 01:36 IST|Sakshi
సంగంబండ పునరావాస బాధితులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీహర్ష

మక్తల్‌: సంగంబండ రిజర్వాయర్‌ కింద ముంపునకు గురైన బాధితులకు ప్రభుత్వం నుంచి అందించాల్సిన నిధులు అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ శ్రీహర్ష అన్నారు. మంగళవారం ఆయన ఆర్‌ఆర్‌ సెంటర్‌లో ముంపు బాధితులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గ్రామంలో 48మందికి ప్లాట్లు నేటికీ మంజూరు చేయలేదని తెలియడంతో, కస్తుర్బా పాఠశాల పక్కనే ఉన్న భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలను గ్రామస్తులు ఏకరువు పెట్టారు. తమ దృష్టికి వచ్చిన అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని కలెక్టర్‌ గ్రామస్తులకు చెప్పారు. అనంతరం మక్తల్‌లో కంటి వెలుగు కేంద్రాన్ని మున్సిపల్‌ కార్యాలయం వద్ద పరిశీలించారు. అలాగే చాకలిగేరి పాఠశాలను సందర్శించారు. మాద్వార్‌ గ్రామానికి వెళ్లి పాఠశాల పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్‌ శ్రీనివాసులు, ఎంపీడీఓ శ్రీధర్‌, తహసీల్దార్‌ తిరుపతయ్య, ఎంపీఓ పావని, ఎంపీటీసీ ఇందిర, సర్పంచ్‌ లక్ష్మమ్మ, ఎంపీటీసీ బాల్‌రాంరెడ్డి, సర్పంచ్‌ రాజు, ఎంపీటీసీ తిమ్మప్ప, పునరావాస కమిటీ అధ్యక్షుడు బాల్‌రెడ్డి, సత్యారెడ్డి, శాంతప్ప పాల్గొన్నారు.

‘మన బడి’ పనుల్లో వేగం పెంచాలి

మాగనూర్‌: మన ఊరు– మన బడి పనులను కాంట్రాక్టర్లు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం ఆయన మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న కిచెన్‌ షెడ్‌, అదనపు గదుల నిర్మాణం పనులను పరిశీలించారు. ఈసందర్భంగా గ్రామ సర్పంచ్‌ రాజు, పెద్దలు పాఠశాల ముందుభాగంలో వ్యాపార సముదాయాల (భవనాల నిర్మాణం) ఏర్పాటు కోసం కలెక్టర్‌ను సంప్రదించగా ప్లానింగ్‌ విని ఆయన సానుకూలంగా స్పందించారు. మాగనూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి అక్కడి వసతులపై ఆరా తీశారు. మాగనూర్‌ రైల్వే బ్రిడ్జి సమీపంలో నూతనంగా ప్రారంభించబోయే ఇసుక రీచును ఆయన పరిశీలించారు. అనుకూలంగా ఉంటే బుధవారం నుంచి ఇసుక తవ్వకాలు మొదలుపెట్టాలని మైనింగ్‌ ఆర్‌ఐ రమేష్‌కు సూచించారు. ఇదే క్రమంలో వర్కూర్‌ గ్రామం దగ్గర నడుస్తున్న ఇసుక రీచును తనిఖీ చేశారు. అక్రమ రవాణాకు పాల్పడితే అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఎస్‌ఓ శ్రీనివాసులు, ఎంపీడీఓ సుధాకర్‌రెడ్డి, ఎంపీఓ జైపాల్‌రెడ్డి, డీఈ, ఏఈ, గ్రామస్తులు పాల్గొన్నారు.

మాగనూర్‌, మక్తల్‌ మండలాల్లో పర్యటించిన కలెక్టర్‌

మరిన్ని వార్తలు