వేసవి భత్యం లేనట్లే..

25 Mar, 2023 01:28 IST|Sakshi
రెనివట్లలో ఉపాధి పనులు పరిశీలిస్తున్న డీఆర్‌డీఏ పీడీ గోపాల్‌నాయక్‌ (ఫైల్‌)

మద్దూరు: ఉపాధి హామీ పథకం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు కూలీలకు తక్కువ పనిచేసినా ఎక్కువ కూలీ వచ్చేది. దీనికి తోడు ఫ్రిబవరి నుంచి జూన్‌ వరకు వేసవిభత్యం అదనంగా కలిపి ఇచ్చేవారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రాష్ట్రానికి సంబంధించిన టీసీఎస్‌(రాగా) సాఫ్ట్‌వేర్‌లో ఉండేవి. కానీ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సాఫ్ట్‌వేర్‌లో వేసవి భత్యానికి సంబంధించిన ఆప్షన్‌ కనిపించడం లేదు. దీనికితోడు రెండు పూటలా పని విధానం, అన్‌లైన్‌ హాజరు నమోదులో తరుచూ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సాంకేతిక కారణాలతో జాబ్‌కార్డు ఆధార్‌ అనుసంధానం కాకపోవడం లాంటి సమస్యలు ఉత్పన్న మవుతున్నాయి. దీంతో పని ఎక్కువ చేసినా కూలీలకు కూలీ మాత్రం తక్కువగా వస్తుంది. 2022–23 ఉపాధి సంవత్సరంలో జిల్లాలో కూలీలకు కూలీ రూ.257కు గాను సరాసరిగా రూ.165.15 మాత్రమే వచ్చింది.

ఉపాధి హామీ పథకం కూలీలకు ఈఏడాది వేసవిభత్యం అందేలా లేదు. గత ఏడాది మార్చి నెలకు ముందున్న సాఫ్ట్‌వేర్‌లో కూలీల

వివరాలు ఉండటంతో వేసవిభత్యం అందించారు. ఈ ఏడాది నుంచి అమలు చేస్తున్న ఎన్‌ఎంఎంఎస్‌ సాఫ్ట్‌వేర్‌లో కొత్తగా కూలీల

వివరాలు నమోదు చేశారు.

ఇందులో సాఫ్ట్‌వేర్‌ సమస్య వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో వేసవిభత్యం

అందే అవకాశాలు కనిపించడం లేదు.

గిట్టుబాటు కావడంలేదు

ఎక్కువగా ఉపాధి పనులు చేపట్టే ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు కూలితోపాటు వేసవిభత్యం పేరుతో అదనంగా 20–30 శాతం వరకు ఇచ్చేవారు. దీంతో పనికి తగిన వేతనం అందేది. ప్రస్తుతం వేసవి భత్యాన్ని తీసేయగా రోజుకు రూ.150 నుంచి రూ.180 వరకు మాత్రమే వస్తున్నాయి. దీంతో ఈ పథకంలో పనిచేయడానికి వెళ్లడం లేదు.

– సిన్యానాయక్‌, ఏర్రగుంటతండా

ఆదేశాలు రాలేదు..

గతేడాది నుంచి ఎన్‌ఎంఎంఎస్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఉపాధి పనులు కొనసాగుతున్నాయి. ఇందులో వేసవి భత్యానికి సంబంధించి ఎలాంటి వివరాలు లేవు. ఒక వేళ ప్రభుత్వం నుంచి ఏవైనా ఆదేశాలు వస్తే సమాచారం ఇస్తాం. నూతన సాఫ్ట్‌వేర్‌లో వేసవి భత్యం లేకుండానే కూలీలకు వేతనాలు జమ చేస్తున్నాం. – గోపాల్‌నాయక్‌, డీఆర్‌డీఓ

సరిగా నమోదు కాని వివరాలు

ఎన్‌ఎంఎంఎస్‌ సాఫ్ట్‌వేరే కారణం

నష్టపోతున్న ఈజీఎస్‌ కూలీలు

మరిన్ని వార్తలు