ఎఫ్‌ఐఆర్‌ నమోదులో జాగ్రత్తలు తప్పనిసరి

25 Mar, 2023 01:28 IST|Sakshi

నారాయణపేట రూరల్‌: ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐటీకోర్‌ ఎస్‌ఐ సునీత అన్నారు. శుక్రవారం జిల్లాలోని అన్ని పీఎస్‌లలో టెక్‌ టీమ్‌ ఆపరేటర్లు, స్టేషన్‌ రైటర్లతో జిల్లా పోలీసు కార్యాలయంలోని ఈ లర్నింగ్‌ సెంటర్‌లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి వర్టికల్‌ అధికారి తన విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని, కేసుల విషయంలో టెక్నికల్‌ విషయాలను క్షుణంగా పరిశీలించాలన్నారు. సాంకేతికతను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉపయోగించుకోవాలన్నారు. ప్రతి ఒక్క సిబ్బందికి సీసీటీఎన్‌ఎస్‌పై అవగాహన కలిగించాలన్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ ద్వారా పాత నేరస్తులను గుర్తించాలని, పీఎస్‌లో జరిగే ప్రతి విషయాన్ని ఎస్‌హెచ్‌ఓ దృష్టికి తీసుకు తీసుకురావాలన్నారు.

గ్రూప్స్‌లో ఉచిత శిక్షణ

నారాయణపేట రూరల్‌: మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రూప్‌–2, 3 పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఏప్రిల్‌ 10నుంచి రెండు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలోని అర్హులైన ముస్లింలు, మైనార్టీలు ఈనెల 29వ తేదీలోగా జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందించాలని ఆ శాఖ జిల్లా అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

లక్ష్య సాధన కోసం కష్టపడి చదవాలి

కోస్గి: ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని.. దానిని చేరుకునేందుకు కష్టపడి చదవాలని జేఎన్‌టీయూ ప్రిన్సిపాల్‌ జయలక్ష్మీ, డీఈఓ లియాఖత్‌ అలీ అన్నారు. శుక్రవారం మండలంలోని బోగారం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన ‘వీడ్కోలు...ప్రేరణ’ కార్యక్రమానికి వారు ముఖ్య అథితులుగా హాజరై మాట్లాడారు. పదో తరగతి విద్యార్థి జీవితానికి ప్రధాన ఘట్టమని, ఇది పూర్తి చేసుకుంటేనే ఇంటర్‌ స్థాయిలో విద్యార్థి తన జీవితాన్ని తనకు అనువైన రంగంలోకి మార్చుకొని ఉన్నత స్థాయికి చేరుకోవడానికి దోహదపడుతుందన్నారు. పాశ్చాత్య పోకడలకు అలవాటు పడుతూ నేటి తరం యువత చెడు మార్గంలో పయనించడం బాధాకరమైన విషయమన్నారు. నేటి యువతే రేపటి భావిభారత నిర్మాతలనే విషయాన్ని గుర్తించి, దేశ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. అనంతరం పరీక్షల్లో పాటించాల్సిన నియమాలు, ఆయా సబ్జెక్ట్‌ల్లో అధిక మార్కుల సాధన కోసం చదవాల్సిన విధానం తదితర అంశాలను ఉపాధ్యాయులు వివరించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం సత్యనారాయణ, క్లస్టర్‌ హెచ్‌ఎం వెంకట్రాముడు, సెక్టోరియల్‌ అధికారి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు