సమష్టి కృషితోనే పంచాయతీల అభివృద్ధి

25 Mar, 2023 01:28 IST|Sakshi
అవార్డులు పొందిన సర్పంచులు, కార్యదర్శులతో ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి

కోస్గి: రాజకీయాలకతీతంగా నాయకులు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు, యువత సమష్టిగా కృషి చేయడం ద్వారా గ్రామ పంచాయతీలు అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధిస్తాయని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మండల స్థాయిలో ఉత్తమ జాతీయ పంచాయతీ అవార్డులను ప్రధానం చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అథితిగా హాజరై ఉత్తమ పంచాయతీలుగా ఎంపికై న గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు, ఇతర సిబ్బందికి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని గ్రామ పంచాయతీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకొని ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దుకుందామన్నారు. అనంతరం ఉత్తమ పంచాయతీలుగా నిలిచిన చెన్నారం, గుండుమాల్‌, పోలేపల్లి, చంద్రవంచ, ముంగిమళ్ళ, సర్జఖాన్‌పేట, అప్పాయపల్లి పంచాయతీలకు అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటయ్య, ఎంపీఓ రహమత్‌, జెడ్పీటీసీ ప్రకాష్‌రెడ్డి, ఎంపీపీ మదుకర్‌ రావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ భీంరెడ్డి, వైస్‌ ఎంపీపీ సాయిలు, పార్టీ అధ్యక్షుడు మ్యాకల రాజేష్‌, మాస్టర్‌ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే లక్ష్యం

ఆనాడు ప్రాణాలకు తెగించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నేడు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం గుండుమాల్‌లో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 70 ఏళ్లుగా జరగని అభివృద్ధిని కేవలం 8 ఏళ్లలో చేసి చూపిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. ప్రతి నాయకుడు, కార్యకర్త ఇంటింటికి వెళ్లి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ విజయలక్ష్మీ, ఎంపీపీ మధుకర్‌ రావు, జెడ్పీటీసీ ప్రకాష్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రామకృష్ణ, పీఏసీఎస్‌ చైర్మన్‌ భీంరెడ్డి, వైస్‌ ఎంపీపీ సాయిలు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వీరారెడ్డి పాల్గొన్నారు.

రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలి

ఉత్తమ పంచాయతీల అవార్డుల పంపిణీలో ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి

మరిన్ని వార్తలు