పాలకమండలి ఖరారు

26 Mar, 2023 01:38 IST|Sakshi
నారాయణపేట వ్యవసాయ మార్కెట్‌యార్డు
పేట మార్కెట్‌ చైర్‌పర్సన్‌గా మోసటి జ్యోతి
● వైస్‌ చైర్మన్‌ లక్ష్మీకాంత్‌ ● గడువు మూడేళ్లు, 18 మందితో జాబితా ● మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే, ఎంపీపీలు

నారాయణపేట: ఎప్పుడెప్పడా అని ఎదురుచూస్తున్న నారాయణపేట మార్కెట్‌యార్డు నూతన పాలక మండలిని నియమిస్తూ శనివారం మార్కెట్‌ డైరెక్టర్‌ లక్ష్మీబాయి (జీఓ నంబర్‌ 120) ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకు ముందున్న కమిటీ గడువు గతేడాది డిసెంబర్‌ 19(సోమవారం)న ముగిసింది. ప్రస్తుతం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, 12మంది డైరెక్టర్లతో పాటు నలుగురు ఎక్స్‌ఆఫీసియో మెంబర్లతో కలుపుకొని 18 మంది పేర్ల జాబితాను విడుదల చేశారు. నారాయణపేట పట్టణంలోని మాజీ కౌన్సిలర్‌ మోసటి జ్యోతి చైర్మన్‌గా, లక్ష్మీకాంత్‌కు వైస్‌ చైర్మన్‌గా ఎంపికయ్యారు.

ఎస్సీ జనరల్‌కు రిజర్వు..

పేట మార్కెట్‌ చైర్మన్‌ పదవి ఈసారి రొటేషన్‌లో రిజర్వేషన్‌ ప్రాతిపదికన ఎస్సీ జనరల్‌కు రిజర్వు అయ్యింది. వ్యవసాయ మార్కెట్‌ వ్యవస్థ ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశంతో మార్కెట్‌ యార్డులలో సైతం రిజర్వేషన్ల ప్రాతిపదికన పాలకవర్గం చైర్మన్‌లను నియమిస్తూవస్తోంది. ఇప్పటికే రెండుసార్లు నారాయణపేట మార్కెట్‌ చైర్మన్లు బీసీలు రిజర్వేషన్‌ ప్రతిపాదికన మొదటిసారి బండి వేణుగోపాల్‌, రెండోసారి సరాఫ్‌ నాగరాజు పదవిని అనుభవించారు. మూడోసారి జనరల్‌ (మహిళ) రిజర్వేషన్‌ కావడంతో మార్కెట్‌ పీఠం తొలి మహిళ చైర్‌పర్సన్‌ భాస్కర కుమారి రెండేళ్లపాటు కొనసాగారు. ఎస్సీకి రిజర్వేషన్‌ కావడంతో బుల్లెట్‌ రాజు తన సతీమణి మోసటి జ్యోతిని మార్కెట్‌ చైర్మన్‌ చేయాలని ఎమ్మెల్యేను కోరినట్లుగానే ఆమెకు చాన్స్‌ దక్కినట్లయ్యింది. అయితే ఎస్సీ జనరల్‌కు రిజర్వేషన్‌ అయినప్పటికీ మాజీ కౌన్సిలర్‌ మొసటి జ్యోతికి అవకాశం ఇవ్వడంతో రెండోసారి మార్కెట్‌ చైర్‌పర్సన్‌గా మహిళ పీఠంపై కూర్చోబెట్టడం చర్చనీయాంశంగా మారింది.

లక్ష్మీకాంత్‌,

వైస్‌ చైర్మన్‌

మోసటి జ్యోతి, చైర్‌పర్సన్‌

గడువు మూడేళ్లు..

నూతన విధానాన్ని అనుసరించి పాలకవర్గం అధ్యక్ష పదవికి రిజర్వేషన్లను వర్తింపజేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో కమిటీ గడువు మార్కెట్‌ పదవీకాలాన్ని ఏడాది, ప్రత్యేక అభ్యర్థనతో మరో ఆరునెలల పా టు పెంచే అవకాశం కల్పించింది. ఆ ఆరు నెలలు దాటిన తర్వాత మరో ఆరు నెలలు ఎమ్మెల్యే సిఫారసు చేస్తే పొడిగించే అవకాశంతో రెండు సంవత్సరాలు పాలకవర్గం కొనసాగింది. కొత్త పాలకవర్గం పదవీకాలం రెండేళ్లు ఉంటుంది. మరో ఏడాది గడువు పొడిగించే అవకాశాన్ని కల్పించారు. గతంలో అధ్యక్షుడు సహా 14 మంది డైరెక్టర్లు ఉండగా, మార్పును అనుసరించి ఈసారి 18 మందితో కమిటీ ఏర్పడింది. గతంలో నామినేషన్‌ పద్ధతిలో పదిమంది డైరెక్టను నియమించగా, ఇప్పుడు 14 మంది నియమితులయ్యారు.

ఇదీ పాలకవర్గం..

మార్కెట్‌ చైర్‌పర్సన్‌ మోసటి జ్యోతిరాజు, వైస్‌ చైర్మన్‌ మన్నె లక్ష్మీకాంత్‌, డైరెక్టర్లుగా గవినోళ్ల మధుసూదన్‌రెడ్డి, ఎస్‌.మాణిక్యప్ప, గోపాల్‌నాయక్‌, చిల్క వెంకటన్న, కాకర్ల నారాయణమ్మ, చీర్ల కొండారెడ్డి, కుర్వ మల్లేశ్‌, చాంద్‌పాషా, హన్మంత్‌రెడ్డి, పి.సురేందర్‌రెడ్డి, ఎస్‌.హనుమాన్‌ధారక్‌, అవుటి జగదీశ్‌, ఊట్కూర్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ ఎం.బాల్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందెఅనసూయ, డీఏఓ జాన్‌సుధాకర్‌, డీఎంఓను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మరిన్ని వార్తలు