దిక్కు లేని చుక్కలు

22 Jul, 2021 05:00 IST|Sakshi

తల్లిదండ్రుల్లో ఒకరిని, సంరక్షులను కోల్పోయిన చిన్నారులు

ప్రపంచంలో 15 లక్షలు పైగా భారత్‌లో 1,19,000

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి ఎందరో చిన్నారుల్ని అమ్మనాన్నలకు దూరం చేసింది. కరోనా బట్టబయలైన మొదటి 14 నెలల్లో 21 దేశాల్లో 15 లక్షల మందికి పైగా పిల్లలు అమ్మ నాన్నలు లేదంటే సంరక్షకుల్ని కోల్పోయినట్టుగా ది లాన్సెట్‌ జర్నల్‌ ఒక అధ్యయనాన్ని ప్రచురించింది. భారత్‌లో 1,19,000 వేల మంది తల్లిదండ్రుల్లో ఒకరికి దూరమై దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు. నేషనల్‌ ఇనిస్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ చేసిన ఈ అధ్యయనానికి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆన్‌ డ్రగ్‌ అబ్యూజ్‌ (ఎన్‌ఐడీఏ) నిధుల్ని సాయం చేసింది. ‘ కరోనా ఆడవారికంటే మగవారిపైనే ఎక్కువ ప్రభావం చూపింది. తండ్రులు, తాతయ్యలను కోల్పోయిన పిల్లలే అధికంగా ఉన్నారు’ అని ఎన్‌ఐడీఏ డైరెక్టర్‌ నోరా డీ వోల్కావ్‌ చెప్పారు,  

అధ్యయనం వివరాలు ఇవీ
► 21 దేశాల్లో 11,34,000 మంది చిన్నారులు తల్లిదండ్రుల్లో ఒకరిని, లేదంటే వారి సంరక్షకులైన బామ్మ, తాతయ్యలని కోల్పోయారు. వీరిలో 10,42,000 మంది తల్లిదండ్రుల్లో ఒకరినీ, లేదంటే ఇద్దరినీ కోల్పోయారు. మొత్తమ్మీద 15,62,000 మంది చిన్నారులు పెద్దల అండని కోల్పోయారు.
► భారత్‌లో 1,19,000 మంది చిన్నారుల తల్లిదండ్రులు, లేదంటే సంరక్షకుల్ని పోగొట్టుకుంటే వారిలో 25,500 మంది చిన్నారుల తల్లుల్ని కరోనా మింగేసింది,. 90,751 మంది చిన్నారుల తండ్రుల్ని కోవిడ్‌ బలి తీసుకుంది.  
► దక్షిణాఫ్రికా, పెరూ, అమెరికా, భారత్, బ్రెజిల్, మెక్సికో దేశాల్లో అధికంగా చిన్నారులు అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్నారు.  
►  ప్రతీ వెయ్యి మంది పిల్లల్లో తల్లి లేదంటే తండ్రిని కోల్పోయిన పిల్లలను పరిగణనలోకి తీసుకుంటే ఇతర దేశాల కంటే భారత్‌ పరిస్థితి మెరుగ్గా ఉంది. ప్రతీ వెయ్యి మంది పిల్లలకు తల్లిదండ్రుల్లో సంరక్షకుల్ని కోల్పోయిన వారి రేటు 0.5 ఉంటే దక్షిణాఫ్రికాలో 6.4, పెరూ (14.1), బ్రెజిల్‌ (3.5), కొలంబియా (3.4), మెక్సికో (5.1), రష్యా (2.0), అమెరికా (1.8)గా ఉంది.
 

భారత్‌లో కరోనా మరణాలు 34–49 లక్షలు?  
భారత్‌లో కరోనాతో మృతి చెంది అధికారిక లెక్కల్లోకి రాని వారు 34 నుంచి 49 లక్షల మంది ఉంటారని తాజా నివేదిక వెల్లడించింది. భారత్‌కు చెందిన మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్, /అమెరికాలో స్వచ్ఛంద సంస్థ సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌కి చెందిన జస్టిన్‌ సాండ్‌ఫర్, హార్వార్డ్‌ యూనివర్సిటీకి చెందిన అభిషేక్‌ ఆనంద్‌లు కలసికట్టుగా ఈ నివేదికను రూపొందించారు. కరోనా మరణాలపై గణాంకాలతో పాటుగా తము కొంత అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించారు. దేశంలో జనవరి 2020, జూన్‌ 2021 మధ్య 34 లక్షల నుంచి 49 లక్షల మంది వరకు కోవిడ్‌ బారిన పడి మరణించినట్టుగా వారు వెల్లడించారు. భారత్‌ చెబుతున్న అధికారిక లెక్కల కంటే ఈ సంఖ్య చాలా చాలా ఎక్కువ. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య బుధవారం నాటికి 4,18,480 ఉన్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రపంచంలో కరోనా మరణాల్లో అమెరికా, బ్రెజిల్‌ తర్వాత స్థానం భారత్‌దే.

మరిన్ని వార్తలు