4.12 లక్షల ప్రమాదాలు.. 1.53 లక్షల మంది బలి

29 Dec, 2022 05:08 IST|Sakshi

న్యూఢిల్లీ:  2021లో దేశవ్యాప్తంగా 4,12,432 రోడ్డు ప్రమాదాల్లో 1,53,972 మంది మరణించారు. 3,84,448 మంది గాయపడ్డారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ తాజాగా ఒక నివేదికలో ఈ మేరకు వెల్లడించింది. 2019తో పోలిస్తే 2021లో ప్రమాదాలు 8.1 శాతం, బాధితుల సంఖ్య 14.8 శాతం తగ్గినట్టు చెప్పింది.

‘‘మృతుల సంఖ్య మాత్రం 1.9 శాతం పెరిగింది. 2020 కంటే 2021లో రోడ్డు ప్రమాదాలు 12.6 శాతం, మరణాలు 16.9 శాతం, గాయపడినవారి సంఖ్య 10.39 శాతం పెరిగాయి. దేశంలో రోజూ సగటున 1,130 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. 422 మంది మరణిస్తున్నారు’’ అని తెలిపింది.

► 2021లో ప్రమాదాల మృతుల్లో 67.7 శాతం 18–45 ఏళ్లలోపు వారే! 18–60 ఏళ్లలోపు వారు 84.5 శాతం మంది.

► గతేడాది 4,12,432 రోడ్డు ప్రమాదాల్లో 31.2 శాతం జాతీయ రహదారులపై, 23.4 శాతం రాష్ట్ర రహదారులపై, 45.4 శాతం ఇతర రోడ్లపై జరిగాయి.

► 2021లో తమిళనాడులో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు సంభవించాయి.  ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువ మంది మరణించారు.  

► రోడ్డు ప్రమాద మరణాలకు ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన, ఓవర్‌ స్పీడ్, రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌ ప్రధాన కారణాలు.

► పమాదాల్లో ద్విచక్ర వాహనాలదే ప్రధాన వాటా. కార్లు, జీపులు తర్వాతి స్థానంలో ఉన్నాయి.

మరిన్ని వార్తలు