స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో కీలకాంశాలు

15 Aug, 2020 14:44 IST|Sakshi

మూడు వ్యాక్సిన్‌లు పలు దశల్లో ఉన్నాయి

రైతు ఉత్పత్తులను నచ్చిన ధరకు అమ్ముకునే స్వేచ్ఛ

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని.. సామాజిక దూరం పాటిస్తూ.. వేడుక నిర్వహించారు. ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని ప్రసంగంలోని కీలకాంశాల.. ‘భారతదేశం శతాబ్దాల విదేశీ పాలనను ఎదుర్కొంది. మన దేశాన్ని, సంస్కృతిని, సంప్రదాయాలను నాశనం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. కాని వారు మన ఆత్మ విశ్వాసాన్ని, సంకల్పాన్ని తక్కువ అంచనా వేశారు. మనం వీటన్నింటిని ఎదుర్కొని జీవించాము.. చివరికి విజయం సాధించాము. ఇతర దేశాలను ఆ‍క్రమించి.. సామ్రాజ్యాన్ని విస్తరించాలని చూశారు. మన దేశంలో వారి జెండాలను ఎగురవేయాలని ఎందరో ప్రయత్నించారు. ఈ ప్రపంచం రెండు ప్రపంచ యుద్దాలను చూసింది. ఎన్నో దేశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. కానీ మనం వీటన్నింటిని తట్టుకుని నిలబడ్డాం. మన స్వాతంత్ర్య పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది’ అన్నారు మోదీ. (పరాయి పాలన నుంచి విముక్తికై..)

‘నేడు భారతదేశంలో మూడు కోవిడ్‌-19 వ్యాక్సిన్‌లు వివిధ దశలలో ఉన్నాయి. ఒక్కసారి అవి తుది అనుమతులు పొందాయంటే.. పంపిణీ కోసం ప్రణాళిక సిద్ధం చేస్తాము. భారతదేశం స్వాలంభన సాధించాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాలని నాకు తెలుసు. ప్రపంచం నలుమూలల నుంచి తీవ్రమైన పోటీ ఉంది. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. భారతదేశం ముందు లక్షలాది సవాళ్లు ఉంటే.. అందుకు మన దగ్గర 130 కోట్ల పరిష్కారాలు కూడా ఉన్నాయి. ముందే చెప్పినట్లుగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి మేం కృషి చేస్తున్నాం. యితర వ్యాపారాల్లో ఒక బిజినెస్‌ మ్యాన్‌కు దేశం, ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయినా తమ ఉత్పత్తిని, సేవలను వారు కోరుకున్న ధరకు.. వారికి నచ్చిన వారికి విక్రయించే స్వేచ్ఛ ఉంది. కానీ రైతులకు అలాంటి అవకాశం లేదు. కానీ ఇప్పుడు మేం ఈ ఆంక్షలను తొలగించాము. రైతులు వారికి నచ్చిన వారికి.. ఉత్తమ ధరకు అమ్ముకునే స్వేచ్ఛను వారికి కల్పించాము’ అని తెలిపారు. (కరోనా వాక్సిన్ :  ప్రధాని మోదీ గుడ్ న్యూస్ )

‘ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాడు దేశ ప్రజల తరఫున కరోనా వారియర్స్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది క్లిష్ట సమయంలో దేశం కోసం పని చేశారు. చాలా మంది తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టారు. వారందరికి దేశం సెల్యూట్‌ చేస్తోంది. దేని గురించి అయినా మన మనస్సులో బలంగా నమ్మినప్పుడు దాన్ని తప్పకుండా సాధించగలం. గతంలో మన పీపీఈ కిట్లు, మాస్క్‌లు, వెంటిలేటర్లు తయారు చేయలేదు. కానీ నేడు వీటన్నింటిని మనం ఉత్పత్తి చేస్తున్నాం. ప్రస్తుతం మన 74వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నాం. 75 వ స్వాతంత్ర్య దినోత్సవ మైలురాయి కోసం ఎదురుచూస్తున్నాము. ఇది మన శక్తిని, సంకల్పాన్ని పెంచుతుంది. ఆ మైలురాయిని అధిగమించినప్పుడు మనం ఘనంగా జరుపుకుంటాము. ఇంకా ఎంత కాలం ముడి పదార్థాలను ఎగుమతి చేసి.. తయారయిన వస్తువులను దిగుమతి చేసుకుంటాం. దీనికి శుభం పలికే సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం మనం వాడే ప్రతి దాన్ని ఇక్కడే తయారు చేస్తున్నాం. అది ఒక్కటి మాత్రమే కాదు.. ప్రపంచానికి ఎగుమతి చేస్తున్నాం.. ఎదుగుతున్నాం’ అన్నారు మోదీ.

మరిన్ని వార్తలు