హృదయ విదారకం.. 10 ఏళ్ల బాలుడిని మింగిన మొసలి.. వీడియో వైరల్‌

12 Jul, 2022 15:30 IST|Sakshi

భోపాల్‌: ఇంట్లో పిల్లలు ఉంటే నిత్యం వారిని ఓ కంట గమనించుకుంటూ ఉండాలి. అందరూ ఉన్నారు కదా చూసుకుంటారనే నిర్లక్ష్యం అస్సలు పనికిరాదు. ముఖ్యంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అన్నిజాగ్రత్తలు చెబుతూ, ఎప్పుకప్పుడు ఓ కన్నేసి ఉంచాలి. ఎందుకంటే క్షణకాలపు అజాగ్రత్త జీవిత కాలపు బాధను మిగిలిస్తుంది. అచ్చం ఇలాగే మధ్యప్రదేశ్‌లో హృదయ విదారక  ఘటన వెలుగుచూసింది. 

షియోపూర్‌లోని చంబల్ నదిలో సోమవారం స్నానం చేస్తున్న బాలుడిపై మొసలి దాడి చేసి, నదిలోకి లాక్కెళ్లింది. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే బాలుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.  నది వద్దకు చేరుకొని బాలుడిని కాపాడే ప్రయత్నం చేశారు.  కర్రలు, తాడు, వల సాయంతో నదిలో ఉన్న మెసలిని బంధించి బయటకు లాగారు. మొసలిని చంపి బాలుడిని రక్షించాలని గ్రామస్తులు భావించారు. 

ఇంతలో సమాచారం అందుకున్న మొసళ్ల సంరక్షణ బృందం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మొసలిని గ్రామస్తుల బారినుంచి రక్షించేందుకు ఇరు వర్గాలు ప్రయత్నించారు. అయితే ఇందుకు కుటుంబ సభ్యులు సాయం‍త్రం వరకు అస్సలు అంగీకరించలేదు. మొసలి కడుపులో బిడ్డ బతికే ఉంటుందని ఆశగా ఎదురు చూశారు. పిల్లాడిని  బయటకు తీసినప్పుడే వదిలేస్తామని చెప్పారు.

చదవండి: వరద బీభత్సం.. హెలికాప్టర్‌ రాకపోతే ప్రాణాలు పోయేవే!

అయితే మొసలి కడుపులో ఉన్న పిల్లవాడు బతికే అవకాశం లేదని పిల్లాడి తల్లిదండ్రులకు అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసు అధికారులు, మొసళ్ల సంరక్షణ విభాగం ఒప్పించడంతో గ్రామస్థులు మొసలిని విడిచిపెట్టారు.  ఈ ఘటనపై  రఘునాథ్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ శ్యామ్ వీర్ సింగ్ తోమర్  మాట్లాడుతూ.. బాలుడు స్నానం చేస్తూ నదిలోకి లోతుగా వెళ్ళాడని తెలిపారు.  చిన్నారిని మొసలి మింగేయడంతో వల, కర్రలతో మొసలిని పట్టుకున్నట్లు గ్రామస్తులు చెప్పారని వెల్లడించారు. కాగా మాయదారి మొసలి కన్న కొడుకుని దూరం చేసి తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. 

మరిన్ని వార్తలు