Heart Touching Photo: ఒక్క ఫోటోతో హృదయాలను కదలిస్తున్న బాలిక

4 Apr, 2022 18:04 IST|Sakshi

వంద మాటలు మాట్లాడినా అర్థంకాని కొన్ని విషయాలు ఒక్క చిత్రం చూస్తే ఇట్టే అర్థం అవుతాయి. మనం చెప్పలేని ఎన్నో భావాలను ఒక్క ఫోటో చెబుతుంది. వంద మాటలకు సమాధానంగా నిలుస్తుంది.కొన్ని చిత్రాలు మనసుకు హాయినిస్తే.. మరికొన్ని దృశ్యాలు గుండెలు పిండేసేలా కనిపిస్తాయి. ఫోటో జీవిత సత్యాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఎన్నో సమస్యలను ప్రతిబింబిస్తుంది. తాజాగా ఓ విద్యార్థిని పాఠశాలలోని తరగతి గదిలో కూర్చున్న ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

మణిపూర్‌ రాష్ట్రంలోని తమెంగ్‌లాంగ్‌కు చెందిన పదేళ్ల చిన్నారి పమి నాలుగో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో చిన్నారి ఓ రోజు తన రెండేళ్ల చెల్లెల్ని ఒళ్లో కూర్చొబెట్టుకొని తరగతి గదిలో పాఠాలు వినేందుకు వచ్చింది. బాలిక తల్లిదండ్రులు వ్యవసాయం పనుల నిమిత్తం పొద్దున్నే పొలానికి వెళ్లడంతో చెల్లెల్ని చూసుకోవాల్సిన బాధ్యతను తనకు అప్పగించారు. అయితే చదువుకోవాలన్న ఆసక్తి కలిగిన పామి తన చెల్లెల్ని ఒంటరిగా ఇంట్లో వదిలి వెళ్లలేక తనను తీసుకొని స్కూల్‌కి వెళ్లింది. తరగతి గదిలో చెల్లెల్ని ఒళ్లో కూర్చొబెట్టుకొని పాఠాలు వినడం, రాసుకోవడం చేస్తుంది. 
చదవండి: విద్యార్థులతో కలిసి డ్యాన్స్‌ అదరగొట్టిన మహిళా కలెక్టర్‌.. వీడియో వైరల్‌!

చదువుపై తనకున్న ఆసక్తి, తల్లిదండ్రుల అప్పజెప్పిన బాధ్యతను రెండింటిని కలగలిపి చూపించే ఈ దృశ్యం అందర్ని మనసుల్ని కదిలిస్తోంది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు.. చెల్లెలి బాధ్యత, భవిష్యత్తు కోసం చిన్నారి పడుతున్న తపనను అభినందిస్తున్నారు. పమి ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవడంతో ఈ విషయం రాష్ట్ర మంత్రి వరకు చేరింది. ఈ ఫోటోలపై మణిపూర్‌ మంత్రి స్పందించారు. చదువు పట్ల చిన్నారికి ఉన్న అంకితభావం తనను ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నారు. సోషల్‌ మీడియాలో ఈ వార్తను చూసిన తర్వాత బాలిక కుటుంబాన్ని గుర్తించామని, వారిని ఇంఫాల్‌ తీసుకురావాలని కోరినట్లు తెలిపారు. బాలిక గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసే వరకు తానే చదివిస్తానంటూ ఆమె కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు