‘104’ మృత్యు మార్గాలు.. ఈ రోడ్లు యమడేంజర్‌ గురూ!

10 Sep, 2022 07:21 IST|Sakshi

చెన్నైలోని ప్రమాదకర రోడ్ల గుర్తింపు 

నివారణ చర్యలపై ప్రత్యేక బృందం దృష్టి

సాక్షి, చెన్నై: రాజధాని నగరం చెన్నైలో 104 మార్గాలు ప్రమాదకరంగా ఉన్నట్లు తేలింది. ఈ మార్గాల్లోనే అధిక ప్రమాదాలు జరుగుతున్నట్లు ప్రత్యేక బృందం పరిశీలనలో వెలుగు చూసింది. ప్రమాదాల నివారణ లక్ష్యంగా ప్రత్యేక కార్యచరణపై దృష్టి పెట్టారు. చెన్నై రోడ్లు నిత్యం వాహనాల రద్దీతో కిటకిటలాడుతుంటాయి. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలు కూడా అధికంగా జరుగుతుంటాయి.

ట్రాఫిక్‌ పోలీసులు అతి వేగంపై దృష్టి పెడుతున్నా, జరిమానాలు విధిస్తున్నా, అతి వేగంగా దూసుకెళ్లే వాళ్లల్లో మాత్రం మార్పు రావడం లేదు. జాతీయ స్థాయి నేర పరిశోధ రికార్డుల మేరకు దేశంలో అత్యధిక ప్రమాదాలు జరిగే  జాబితాలో మొదటి మూడు నగరాల్లో  చెన్నై కూడా ఉంది. ఆ మేరకు ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించేందుకు ప్రత్యేక బృందం నెల రోజుల క్రితం రంగంలోకి దిగింది.  ఐపీఎస్‌ అ«ధికారి వినిత్‌ మన్కోడో నేతృత్వంలో ఐఐటీ నిపుణులు, చెన్నై కార్పొరేషన్, రహదారుల శాఖ వర్గాలతో కూడిన బృందం గత నెల రోజులుగా చెన్నైలోని రోడ్లపై సుదీర్ఘ పరిశీలన జరిపింది.  

కమిషనర్‌ సమాలోచన 
ఈ బృందం జరిపిన పరిశీలనలో 104 మార్గాలు మృత్యుమార్గాలు, ప్రమాదాలకు నెలవుగా ఉన్నట్లు గుర్తించారు. ఈ మార్గాల్లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, మరణాలతో పాటు గాయాలపాలయ్యే వారి సంఖ్య అధికంగా ఉన్నట్టు తేలింది. చిన్న ప్రమాదాలు సైతం పై మార్గాల్లో జరుగుతున్నట్టు తేల్చారు. దీంతో ఈ మార్గాల్లో ప్రమాదాల నివారణకు చర్యలపై దృష్టి పెట్టారు. శుక్రవారం కమిషనర్‌ శంకర్‌ జివ్వాల్‌తో ఈ బృందం సమావేశమైంది. ప్రమాదాలు అధికంగా జరిగే మార్గాల గురించి చర్చించారు.

ఈ మార్గాల్లో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై కార్యచరణకు సిద్ధమయ్యారు. ఈ విషయంగా కమిషనర్‌ శంకర్‌జివ్వాల్‌ మాట్లాడుతూ.. నగరంలో ప్రమాదాల నివారణ లక్ష్యంగా ముందుకెళుతున్నామన్నారు. 2021తో పోల్చితే ఈ 8 నెలలు చెన్నైలో ప్రమాదాలు 20 శాతం తక్కువగానే ఉన్నట్టు పేర్కొన్నారు. అయినా, ప్రమాదాలకు ఆస్కారం ఇవ్వకుండా వాహనదారులను అప్రమత్తం చేసే విధంగా ప్రత్యేక కార్యచరణపై దృష్టి పెట్టనున్నామని తెలిపారు. ఈ బృందం పేర్కొంటున్న 104 మార్గాల్లో పరిశీలన జరపనున్నామని, ఇక్కడ నివారణ లక్ష్యంగా చేపట్టాల్సిన పనులపై దృష్టి పెట్టనున్నామని తెలిపారు. 

మరిన్ని వార్తలు