బంగారు పతకాలు సాధించిన బామ్మ.. 106 ఏళ్ల వయసులో

28 Jun, 2023 15:58 IST|Sakshi

డెహ్రాడున్: హర్యానాలోని కద్మ అనే కుగ్రామానికి చెందిన రమాబాయి 18వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలలో పాల్గొని 106 ఏళ్ల వయసులో 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెం తోపాటు షాట్ పుట్ లో కూడా బంగారు పతకాలను గెలుచుకున్నారు. నడుము వాల్చి సేదదీరాల్సిన వయస్సులో రమాబాయి సాధించిన ఈ ఫీట్ నడుమొంచని నేటి యువతకు చెంపపెట్టు లాంటిది. 

ప్రపంచ రికార్డుతో మొదలు.. 
రెండేళ్ల క్రితం అంటే బామ్మ వయసు 104 ఏళ్ళున్నప్పుడు మనవరాలు షర్మిలా సంగ్వాన్ నింపిన స్ఫూర్తితో అథ్లెటిక్స్ వైపు అడుగులేసింది. సరిగ్గా ఏడాది దాటేసరికి 85 ఏళ్ళు పైబడిన కేటగిరీలో 100 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు కూడా సొంతం చేసుకుంది. వడోదరలో జరిగిన ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో 100 మీటర్ల పరుగును 45.50 సెకన్లలో పూర్తి చేసి కొత్త రికార్డును సృష్టించింది. 

ఇక అక్కడి నుండి బామ్మ వెనుదిరిగి చూడలేదు. ఈ వ్యవధిలో రమాబాయి మొత్తం 14 ఈవెంట్లలో సుమారు 200 మెడల్స్ సాధించింది. తాజాగా జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ లో ఏకంగా మూడు బంగారు పతకాలను చేజిక్కించుకుని యువతకు ఆదర్శప్రాయంగా నిలిచింది. పతకాలను అందుకోవడానికి పోడియం వద్దకు వెళ్లిన బామ్మ తన కాళ్లకు శక్తినిచ్చిన మనవరాలికి కృతఙ్ఞతలు చెప్పారు. 

అలా మొదలైంది.. 
2016లో వాంకోవర్లో జరిగిన అమెరికన్ మాస్టర్స్ గేమ్ ఈవెంట్లో పంజాబ్ కు చెందిన కౌర్ అనే బామ్మ 100 ఏళ్ల వయసులో 100 మీటర్ల పరుగుని 1 నిముషం 26 సెకన్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించింది. కౌర్ ఆ తర్వాత ఏడాదే ఆక్లాండ్లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ ఈవెంట్లో మరో ఏడు సెకన్లను తగ్గిస్తూ తన రికార్డును తానే మెరుగుపరుచుకుంది. రమాబాయి మనవరాలు కౌర్ గురించి చెప్పినప్పుడు మొట్టమొదటిసారి రమాబాయికి కూడా అథ్లెటిక్స్ లో పాల్గొనాలన్న తృష్ణ కలిగింది.      
     
ఫిట్నెస్ కోసం.. 
అప్పటివరకు గృహిణి గాను, ఎప్పుడైనా వ్యవసాయం చేసుకుంటూ కాలం వెళ్లదీసిన బామ్మ రూటు మార్చింది. మైదానంలో అడుగుపెట్టి వయసు అడ్డంకులన్నిటినీ చెరిపేసి సాధన చేసింది. ఫిట్నెస్ కోసం పాలు, పాల ఉత్పత్తులు, తాజా ఆకుకూరలు మాత్రమే ఆహారంగా తీసుకుంది. 

భారీ వాహనాన్ని నడిపే రమాబాయి మనవరాలు షర్మిల మొదట తన బామ్మకు క్రీడలవైపు వెళ్లాల్సిందిగా సలహా ఇచ్చినప్పుడు మొత్తం కుటుంబం భయపడింది... ఈ వయసులో బామ్మను సరిగ్గా చూసుకోకపోతే గ్రామస్తులు దుమ్మెత్తిపోస్తారని భయపడినట్లు వెల్లడించారు. కానీ తన బామ్మ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ లేటు వయసులో చాంపియన్ గా అవతరించి మొత్తం గ్రామానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.   

ఇది కూడా చదవండి: వేలాది పక్షుల మృతి.. పురుగు మందులే కారణం?  

మరిన్ని వార్తలు