బిల్లిమోరా-వాఘై హెరిటేజ్ రైలు నిలిపివేత

11 Dec, 2020 14:36 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

గాంధీనగర్‌: దాదాపు 100 సంవత్సరాలకు పైగా సేవలందించిన బిల్లిమోరా-వాఘై హెరిటేజ్‌ రైలు ప్రయాణానికి శుభం కార్డు పడనుంది. ఆర్థిక భారం కారణంగా ఈ రైలును నిలిపివేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. 107 సంవత్సరాలుగా పశ్చిమ రైల్వే అధ్వర్యంలో ఉత్తర గుజరాత్‌లో ఈ నారోగేజ్‌ రైలు సేవలందించింది. అయితే గత కొన్నేళ్లుగా ప్రయాణికులు రద్దీ తగ్గడంతో దీని నిర్వహణ రైల్వేకు భారంగా మారింది. బిల్లిమోరా-వాఘై లైన్‌తో పాటు మరో 10 లైన్లలో కూడా రద్దీ తగ్గడంతో వీటిని కూడా నిలిపివేస్తున్నట్లు రైల్వే శాఖ నిర్ణయించింది. 

ఇక బిల్లిమోరా-వాఘై హెరిటేజ్‌ రైలు 1913లో బిట్రీష్‌ వారి పాలన కాలంలో ప్రారంభమయ్యింది. పశ్చిమ గుజరాత్‌లోని మారుమూల పల్లెల్లో నివసిస్తున్న గిరిజనులు ఈ రైలు సేవలను ఎక్కువగా పొందారు. అయితే గత కొద్ది కాలంగా ప్రయాణికులు రద్దీ తగ్గుతూ వస్తోంది. ఇది ఇలా ఉండగానే.. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ విధించడంతో పరిస్థితి మరింది దిగజారింది. ఇక నిర్వహణ భారం పెరగడంతో దీన్ని నిలిపివేయాలంటూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ హెరిటేజ్‌ రైలు వల్సాద్‌లోని బిల్లిమోరా జంక్షన్ నుంచి డాంగ్స్‌లోని వాఘై జంక్షన్ వరకు సుమారు 63 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది. రోడ్డు, ఇతర ఎలాంటి ఎలాంటి కనెక్టివిటీ లేని ప్రాంతాలు ఈ మార్గంలో ఉన్నాయి. (చదవండి: శ్రామిక్‌ రైళ్లను అడగడం లేదేంటి?)

ఐదు బోగీలతో కూడిన ఈ రైలులో 15 రూపాయల కంటే తక్కువ ఛార్జీలు వసూలు చేశారు. బిల్లిమోరాలోని చిక్కూ, మామిడి పొలాలలో పనిచేసే కార్మికులు సూరత్‌కు ప్రయాణించే వ్యాపారవేత్తలు దీనిలో ప్రయాణం చేసేవారు. బరోడాను పాలించిన గైక్వాడ్‌ రాజకుటుంబానికి గుర్తుగా బిల్లిమోరా-వాఘై రైలు సేవలు ప్రారంభించారు. మహమ్మారి సమయంలో ఐదు నెలల పాటు సాధారణ రైళ్ల సర్వీసులకు అంతరాయం కలిగించడంతో పశ్చిమ రైల్వే 2,350 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. దాంతో నిర్వహణ భారం పెరిగిన లైన్లను నిలిపివేయాలని నిర్ణయించుకుంది. 
 

మరిన్ని వార్తలు