-

Women Army Officers: నెరవేరిన దశాబ్దాల కల.. ఆమె కమాండ్‌లో...

23 Jan, 2023 04:29 IST|Sakshi

దేశంలో తొలిసారిగా కల్నల్‌ స్థాయికి ఎదిగిన మహిళా అధికారులు

సియాచిన్‌లోనూ కమాండింగ్‌

అధికారులుగా మహిళల నియామకం

ఆకాశంలో సగం కాదు... నింగి నేల నీరు దేనినైనా పూర్తిగా కమాండ్‌ చేస్తామంటోంది మహిళాలోకం కఠోరమైన శారీరక శ్రమ చేయాల్సిన కదనరంగాన్ని కూడా నడిపించడానికి ముందుకొచ్చింది.. దశాబ్దాలుగా ఎందరో మహిళా అధికారుల కల ఎట్టకేలకు నెరవేరింది.   100 మందికిపైగా మహిళలు పదోన్నతులు పొంది కల్నల్‌ స్థాయికి ఎదిగారు.  
 
భారత ఆర్మీలో చరిత్రాత్మక ముందడుగు పడింది. సియాచిన్‌ సహా వివిధ కమాండ్‌ యూనిట్లను మహిళలు కూడా ముందుండి నడిపించనున్నారు. ఇన్నాళ్లూ పురుషులకు మాత్రమే పరిమితమైన ఈ బాధ్యతల్ని మొట్టమొదటి సారిగా మహిళలు కూడా నిర్వర్తించనున్నారు. రెజిమెంట్లు, బెటాలియన్లకు అధికార పదవుల్లో మహిళల నియామకానికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ ఈ నెల 9 నుంచి 22 వరకు జరిగింది. దాదాపుగా 108 మంది మహిళా అధికారులు కల్నల్‌గా పదోన్నతులు పొందారు.

1992 నుంచి 2006 బ్యాచ్‌కు చెందిన మహిళా అధికారులకు పదోన్నతులు ఇవ్వడానికి ప్రత్యేక కమిటీ ఎంపిక ప్రక్రియ పూర్తి చేసింది. వీరంతా ఇంజనీర్స్, సిగ్నల్స్, ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్, ఇంటెలిజెన్స్‌ కోర్, ఆర్మీ సర్వీస్‌ కోర్, ఆర్మీ ఆర్డన్స్‌  కోర్, ఎలక్ట్రికల్, మెకానికల్‌ ఇంజనీర్స్‌ వంటి విభాగాలకు అధికారులుగా సేవలందిస్తారు. భారత సాయుధ బలగాల్లో 1992 నుంచి మహిళా అధికారులు ఉన్నారు. అయితే వారంతా షార్ట్‌ సర్వీసు కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) అధికారులుగానే ఇన్నేళ్లుగా కొనసాగుతున్నారు.

ఇంజనీర్లు, న్యాయవాదులు, వంటి అడ్మినిస్ట్రేటివ్‌ పాత్రలే పోషిస్తున్నారు. యుద్ధ క్షేత్రాల్లో గాయపడ్డ జవాన్లకి చికిత్స అందించే వైద్యులు, నర్సులుగా కూడా ఉన్నారు. 16–18 ఏళ్లు సర్వీసు ఉంటేనే కమాండర్‌ పదవికి అర్హత సాధిస్తారు. ఇప్పుడు కోర్‌ ఆఫ్‌ ఆర్టిలరీ, కంబాట్‌ సపోర్ట్‌ ఆర్మ్‌లలో మహిళా అధికారుల్ని నియమించనున్నారు. భారత వాయుసేన, నావికాదళంలో అన్ని విభాగాల్లో మహిళా అధికారులు ఉన్నారు. వారికి శాశ్వత కమిషన్లు కూడా ఉన్నాయి. యుద్ధ విమానాలను, యుద్ధ నౌకల్ని నడిపించే మహిళలూ ఉన్నారు. త్రివిధ బలగాల్లో అతి పెద్దదైన పదాతి దళంలో మాత్రమే మహిళల పట్ల ఇన్నాళ్లూ వివక్ష కొనసాగుతూ వచ్చింది.  

ఎందుకీ వివక్ష
పురుషులతో పోలిస్తే మహిళల శారీరక దారుఢ్యంపైనున్న సందేహాలే ఇన్నాళ్లూ వారికి అవకాశాల్ని దూరం చేశాయి. మాతృత్వం, పిల్లల పోషణ, ప్రసూతి సెలవులు వంటివి మహిళలకు తప్పనిసరిగా ఇవ్వాలని, యుద్ధం ముంచుకొచ్చే నేపథ్యాల్లో అది సాధ్యం కాదనే వాదన వినిపించింది. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తోంది.  మహిళలకు ఎక్కడైనా పని చేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్లు వినిపించాయి. భారత వాయుసేన, నావికాదళంతో పోలిస్తే ఆర్మీలో వివక్ష ఎక్కువగా ఉంది. యుద్ధభూమిలో నేరుగా మహిళలుంటే శత్రు దేశానికి చిక్కితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో ఇప్పటికీ పోరాట క్షేత్రాల్లో మహిళా కమాండర్లను నియమించడానికి భారత సైన్యం ఇంకా సిద్ధంగా లేదు.

సుప్రీం తీర్పుతో నెరవేరిన కల  
భారత సైన్యంలో పనిచేస్తున్న మహిళా అధికారులకు శాశ్వత కమిషన్, కమాండింగ్‌ పదవులు ఇవ్వాల్సిందేనని 2020 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు చెప్పింది. వారు ఎన్ని సంవత్సరాలుగా సర్వీసులో ఉన్నారనే విషయంతో సంబంధం లేకుండా అందరికీ శాశ్వత కమిషన్‌ వర్తింపచేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుతో ఆర్మీలో మహిళలు పురోగతి సాధించడానికి, నాయకత్వ సామర్థ్యాలను ప్రదర్శించడానికి, పదోన్నతులకు మార్గం సుగమమైంది.  

యూనిట్‌ను కమాండ్‌ చేయడమంటే..?  
పదాతి దళంలో క్షేత్రస్థాయిలో సైనికులందరికీ నేరుగా ఆదేశాలు ఇస్తూ వారిని ముందుకు నడిపించే కీలక బాధ్యత. ఇప్పటివరకు పురుషులు మాత్రమే నిర్వహించిన ఈ బాధ్యతల్ని మహిళలు కూడా అందుకున్నారు. సైన్యంలో కల్నల్‌ పదవి మహిళకి లభిస్తే ఆమె కనుసన్నల్లోనే సైన్యం నడుస్తుంది. బ్రిగేడర్, మేజర్‌ జనరల్, లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ వంటి ఉన్నతాధికారులు నేరుగా సైనికులతో సంబంధాలను కొనసాగించరు. ఇలాంటి పదవుల్లోనే ఎన్నో సవాళ్లను మహిళలు ఎదర్కోవాల్సి ఉంటుంది. అప్పుడే మహిళల్లో నాయకత్వ సామర్థ్యం బయట ప్రపంచానికి తెలుస్తుంది.  
‘‘సియాచిన్‌లో మొట్టమొదటి మహిళా అధికారిగా శివ చౌహాన్‌ను నియామకం మాలో కొత్త ఉత్సాహాన్ని పెంచింది. స్త్రీ, పురుషులన్న భేదం లేకుండా ప్రతీ ఒక్కరికీ వారికి మాత్రమే సొంతమయ్యే సామర్థ్యాలుంటాయి. ఆర్మీలో మహిళలకు మంచి భవిష్యత్‌ ఉంది. శారీరక దారుఢ్యం ఉన్నవారు కూడా ఇన్నాళ్లూ వివక్ష కారణంగా పదవులకి దూరమయ్యారు. ఇక ఆ రోజులు పోయాయి’’
– దీక్షా ధామిన్, ఆర్మీకి శిక్షణ పొందుతున్న యువతి

‘‘ఆర్మీలోకి రావాలనుకునే మహిళల సంఖ్య ఇంకా పెరుగుతుంది. పోరాట క్షేత్రాలకు సంబంధించిన విభాగాల్లో కూడా మహిళా అధికారులు రావాలి. ఎందుకంటే మహిళలు ఎంతో చురుగ్గా, త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంతో ఉంటారు’’
– దీప్‌నూర్‌ సహోతా, ఆర్మీకి శిక్షణ పొందుతున్న యువతి

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు