వరద బీభత్సం, 112 మంది మృతి..99 మంది గల్లంతు

25 Jul, 2021 08:58 IST|Sakshi

మహారాష్ట్రలో కొనసాగుతున్న వర్ష బీభత్సంరాయ్‌గఢ్‌లో పరిస్థితి  మరింత దారుణం  

ముంబై: భీకర వర్షాల ధాటికి ముంచెత్తిన వరదలు, కొండ చరియలు విరిగి పడిన ఘటనల్లో మహారాష్ట్రలో శనివారం ఉదయంనాటికి 112 మంది ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ శనివారం చెప్పారు. రాయ్‌గఢ్‌ జిల్లాలో 52 మంది, రత్నగిరిలో 21, సతారాలో 13, థానేలో 12, కొల్హాపూర్‌లో 7, ముంబైలో 4, సింధుదుర్గ్‌లో ఇద్దరు, పుణేలో ఒకరు మరణించారు. మరో 53 మంది గాయపడ్డారు. 99 మంది జాడ తెలియాల్సి ఉంది. భారీ వర్షాలు రాయ్‌గఢ్‌ జిల్లా ప్రజలను అతలాకుతలం చేశాయి. జిల్లాలోని తలియే గ్రామంలో కొండచరియలు ఇళ్లపై విరిగిపడి 37 మరణించగా, మరో 10 మంది వర్షాల సంబంధ ఘటనల్లో మృతి చెందారని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ గణాంకాల్లో వెల్లడైంది. మొత్తం 1,35,313 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారని పవార్‌ పుణెలో మీడియాతో చెప్పారు. కొంకణ్‌ తీరప్రాంత జిల్లాలైన రాయ్‌గఢ్, రత్నగిరి, పశ్చిమ మహారాష్ట్రలోని కొల్హాపూర్, సతారా జిల్లాలపై వర్షం తీవ్ర ప్రభావం చపింది. 14 ఆర్మీ, తీర గస్తీ బృందాలు, 34 ఎన్‌డీఆర్‌ఎఫ్, నాలుగు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక పనుల్లో నిమగ్నమయయి. వరద ప్రాంతాల్లో ప్రభుత్వం రేషన్‌ సాయం చేస్తోందని, సామాజిక సంస్థలు శివభోజన్‌ థాలీ కేంద్రాలను తెరవాలని పవార్‌ కోరారు. రాయ్‌గఢ్‌ జిల్లాలో తాలియే గ్రామంలో గురువారం కొండచరియలు విరిగిపడిన ఘటలో 41 మృతదేహాలను  బయటకుతీశారు. చాలా మంది జాడ తెలియాల్సి ఉందని డీఐజీ(కొంకణ్‌) సంజయ్‌ మోహితే చెప్పారు. 

పునరుద్ధరణ కష్టమే.. 
కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి రత్నగిరి జిల్లాలోని ప్లున్, ఖేద్, మహద్‌ గ్రామాలు, రాయ్‌గఢ్‌ జిల్లాలోని పలు గ్రామాల్లో వరద విలయం కొనసాగుతోంది. ఎక్కడి నీరు అక్కడే నిలి ఉండటంతో పునరుద్ధరణ పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఇళ్లన్నీ బురదతో నిండిపోయాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. తమ వారిని కోల్పోయిన విషాదఘటనను స్థానికులు మర్చిపోలేకపోతున్నారు. వరద బాధితులకు అత్యవసరాలైన తాగు నీరు, వైద్యం, ఆహార, విద్యుత్‌ సదుపాయాల కల్పన సైతం మహారాష్ట్ర సర్కార్‌కు కష్టంగా వరింది. రోడ్లన్నీ జలమయమమయ్యాయి. ‘21వ తేదీ రాత్రి మొదలైన వర్షం ఆగనేలేదు. వరద నీరు ఇంటిని ముంచేసింది. భయం భయంగా రాత్రంతా ఇంటి పై కప్పు మీద సాయం కోసం చశాం. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం వచ్చి మమ్మల్ని రక్షించింది ’అని చిప్లున్‌ గ్రామానికి చెందిన ప్రగతి రాణె వాపోయారు.

మరిన్ని వార్తలు