సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీజేపీ ఎమ్మెల్యేలు

23 Jul, 2021 03:21 IST|Sakshi

అసెంబ్లీ నుంచి తమ సస్పెన్షన్‌ను సవాలు చేస్తూ పిటిషన్‌

న్యూఢిల్లీ: మహారాష్ట్ర శాసనసభ నుంచి ఏడాదిపాటు సస్పెండ్‌ అయిన 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తమ సస్పెన్షన్‌ను సవాలు చేస్తూ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి తరఫున లాయర్‌ అభికల్ప్‌ ప్రతాప్‌ సింగ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేస్తూ జారీ అయిన ఉత్తర్వులను ఆ పిటిషన్‌లో సవాల్‌ చేశారు. జూలై 5వ తేదీన మహారాష్ట్ర అసెంబ్లీలోని స్పీకర్‌ చాంబర్‌లో ప్రిసైడింగ్‌ అధికారి భాస్కర్‌ జాదవ్‌తో అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై మహారాష్ట్ర ప్రభుత్వం ఈ 12 మంది ఎమ్మెల్యేలను ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఏడాది పాటు సస్పెండ్‌ అయిన ఎమ్మెల్యేల్లో సంజయ్‌ కుటే, అశిష్‌ షెలార్, అభిమన్యు పవార్, గిరీశ్‌ మహాజన్, అతుల్‌ భట్‌కాల్కర్, పరాగ్‌ అలావని, హరీశ్‌ పింపాలే, యోగేశ్‌ సాగర్, జయ్‌ కుమార్‌ రావత్, నారాయన్‌ కుచే, రామ్‌ సత్పుతే, బంటీ భాంగ్డియా ఉన్నారు.

వీరిని సస్పెండ్‌ చేయాలన్న తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి అనిల్‌ పరాబ్‌ ప్రవేశపెట్టగా, అది సభ ఆమోదం పొందింది. అయితే, ప్రభుత్వానివి తప్పుడు ఆరోపణలని ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ మండిపడ్డారు. ప్రతిపక్షాన్ని అణగదొక్కేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని, తమ సభ్యుల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. స్థానిక సంస్థల్లో ఓబీసీ కోటాకు సంబంధించి ప్రభుత్వ తప్పిదాలను బయట పెట్టినందుకే ప్రభుత్వం తమపై కక్ష కట్టిందని ధ్వజమెత్తారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ప్రిసైడింగ్‌ అధికారితో అనుచితంగా ప్రవర్తించలేదని ఫడ్నవిస్‌ స్పష్టం చేశారు. అయితే, ప్రిసైడింగ్‌ అధికారి భాస్కర్‌ జాదవ్‌తో పాటు కొందరు శివసేన ఎమ్మెల్యేలే అనుచితంగా ప్రవర్తించారని వస్తున్న ఆరోపణలపై భాస్కర్‌ జాదవ్‌ స్పందించారు. తనపట్ల కొందరు అసభ్య పదజాలం ఉపయోగించారని, తానే తప్పుగా మాట్లాడానని అంటున్నారని, దీనిపై తాను విచారణకు సిద్ధమని పేర్కొన్నారు. తాను అనుచితంగా ప్రవర్తించినట్లు తేలితే ఎటువంటి శిక్షకైనా సిద్ధమని భాస్కర్‌ జాదవ్‌ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు