12 మందికి ఉద్వాసన..

8 Jul, 2021 05:09 IST|Sakshi

అమాత్యుల పనితీరు, సమీకరణాలే ప్రామాణికం

ఆరోగ్య, విద్యా శాఖలపై కరోనా ఎఫెక్ట్‌!

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2019లో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం కీలక శాఖలు చేపట్టిన వారిలో ఏకంగా ఆరుగురు కేబినెట్‌ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరితో పాటు ఆరుగురు సహాయమంత్రులు సైతం బుధవారం జరిగిన మంత్రివర్గ విస్తరణకు ముందు రాజీనామాలు సమర్పించారు. ఈ మేరకు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ 12మంది కేంద్ర మంత్రుల రాజీనామాలను ఆమోదించారు. కేంద్ర మంత్రుల రాజీనామాల వెనుక వారి వయస్సు, కరోనా సమయంలో శాఖల పనితీరు, బెంగాల్‌ ఎన్నికల ప్రభావం స్పష్టంగా కనిíపించింది. ఇందులో కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రిగా ఉన్న తావర్‌చంద్‌ గెహ్లాట్‌ను వయస్సు రీత్యా మంత్రివర్గం నుంచి తప్పించి కర్ణాటక గవర్నర్‌గా నియమించారు. ఈయనతోపాటు విద్య, వైద్య, పర్యావరణ శాఖలకు చెందిన కేబినెట్‌ మంత్రితో పాటు సహాయమంత్రులను సైతం పక్కనబెట్టేశారు. 

కరోనా సెకండ్‌ వేవ్‌లో దేశంలోని ఆరోగ్య సేవల పేలవమైన పరిస్థితి కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఉద్వాసనకు దారితీసింది. అదే శాఖలోని సహాయమంత్రి అశ్విని చౌబేపై వేటు పడింది. బెంగాల్‌లో బీజేపీ ఓటమి ప్రభావంతో ఇద్దరు బెంగాల్‌కు చెందిన బాబుల్‌ సుప్రియో, దేబోశ్రీ చౌదరిలపై వేటు పడింది. వీరితో పాటు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డి.వి.సదానంద గౌడ, కేంద్ర న్యాయ, ఐటీ కమ్యూనికేషన్స్‌ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్, విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ నిశాంక్, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్, కార్మిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర) సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌లకు ఉద్వాసన పలికారు. వీరితోపాటు సంజయ్‌ ధోత్రే, రతన్‌లాల్‌ కటారియా, ప్రతాప్‌ సారంగీ తమ పదవులకు రాజీనామా చేశారు.

కరోనా కారణంగా హర్షవర్ధన్‌ ఉద్వాసన
కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవలు కుప్పకూలి పోయిన కారణంగా వై ద్య శాఖ మంత్రిగా ఉన్న డాక్టర్‌ హర్షవర్థన్‌పై వేటు పడిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో మోదీ ప్రభుత్వం పైపెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ కారణంగా హర్షవర్ధన్‌ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఆయన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను కూడా నిర్వహించారు. అటువంటి పరిస్థితిలో హర్షవర్థన్‌ రాజీనామాతో 2 కీలక శాఖలు ఖాళీ అయ్యాయి.

అనారోగ్య కారణాలతో పోఖ్రియాల్‌ ఔట్‌
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రమేష్‌ పోఖ్రియాల్‌ కేంద్ర విద్యాశాఖ బాధ్యతలకు రాజీనామా చేశారు. ఆరోగ్య సమస్యల కారణాలతో నిశాంక్‌ను తొలగించినట్లు తెలిసింది. కొన్ని రోజుల క్రితం ఆయన కరోనా బారినపడి ఒక నెల పాటు ఆసుపత్రి పాలయ్యారు. ఆ సమయంలో దేశంలో విద్యారంగంలో పరిస్థితి ఘోరంగా దిగజారిందనే విమర్శలు వచ్చాయి. విద్యార్థులు, తల్లిదండ్రుల ఒత్తిడి నేపథ్యంలో సీబీఎస్‌ఈపై నిర్ణయం తీసుకొనే విషయంలో ప్రధాని మోదీ స్వయంగా ముందుకు రావలసి వచ్చింది. ప్రధాని మోదీ ఎంతో కీలకంగా భావించే జాతీయ విద్యావిధానం అమలులో  మంత్రిగా చొరవ చూపలేదన్నది కూడా పదవి కోల్పోవడానికి కారణమని తెలిసింది.    

బెంగాల్‌ ఎన్నికల కారణంగా..
పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్‌ లోక్‌సభ స్థానానికి చెందిన ఎంపీ బాబుల్‌ సుప్రియో కేంద్ర పర్యావరణ శాఖ సహాయమంత్రిగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఆయనను బాధ్యుడిగా చేసిన కారణంగా పార్టీపై సుప్రియో ఆగ్రహంగా ఉన్నారని ఆయన సన్నిహితులు తెలిపారు. సుమారు 50వేల ఓట్ల తేడాతో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు.  మోడీ ప్రభుత్వ మంత్రివర్గంలో సీనియర్‌ మంత్రిగా ఉన్న తావర్‌చంద్‌ గెహ్లాట్‌ తన వయస్సు రీత్యా పదవి నుంచి తప్పుకోవలసి వచ్చింది. అయితే, ఆయనను కర్ణాటక గవర్నర్‌గా చేయడం ద్వారా క్రియాశీల రాజకీయాల నుంచి గౌరవప్రదమైన వీడ్కోలు ఇచ్చారు.

3 శాఖలపై కరోనా తీవ్ర ప్రభావం  
► ఆరోగ్య శాఖ: సెకండ్‌ వేవ్‌ను ఎదుర్కోవటంలో, నిర్వహణలో పూర్తిగా విఫలమైంది. దీంతో ఇద్దరు మంత్రులను తొలగించారు.  
► విద్యా శాఖ: నూతన జాతీయ విద్యావిధానాన్ని దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలం. ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి క్రెడిట్‌ రాలేదు. దీంతో ఇద్దరు మంత్రులను తొలగించారు.
►  కార్మిక శాఖ: కార్మికుల వలస, సుప్రీంకోర్టు మందలించడం, అసంఘటిత రంగ కార్మికుల కోసం పోర్టల్‌ను సృష్టించలేకపోవడం, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంపై మంత్రి రాసిన లేఖ వైరల్‌ కారణంగా మంత్రిపై వేటు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు