12 శాతం పెరిగిన ధాన్యం సేకరణ

25 Jan, 2023 06:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా ధాన్యం సేకరణలో గణనీయమైన వృద్ధి నమోదయ్యింది. గత ఏడాది సీజన్‌లో సేకరించిన ధాన్యంతో పోలిస్తే ఈసారి 12 శాతం అధికంగా సేకరించడం విశేషం. గత ఏడాది జనవరి మూడో వారానికి 5.50 కోట్ల మెట్రిక్‌ టన్నులు సేకరించగా, ఈ ఏడాది ఏకంగా 6.20 కోట్ల మెట్రిక్‌ టన్నులు సేకరించారు. మద్దతు ధరకు అనుగుణంగా రూ.1.28 లక్షల కోట్ల మేర చెల్లింపులు సైతం చేసినట్లు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

సీజన్‌ మొత్తం ముగిసే నాటికి 9 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించే అవకాశం ఉన్నట్లు తెలియజేసింది. నిజానికి గత ఏడాది ఖరీఫ్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.1.42 లక్షల కోట్ల విలువైన 7.25 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఈసారి విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో పంజాబ్, హరియాణా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఒడిశా తదితర రాష్ట్రాల్లో భారీగా ధాన్యం సేకరణ జరుగుతోంది. పంజాబ్‌లో 1.81 కోట్ల మెట్రిక్‌ టన్నులు, ఛత్తీస్‌గఢ్‌లో 92 లక్షలు, హరియాణాలో 58.97 లక్షలు, తెలంగాణలో 59 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర సేకరణ జరిగింది.

మరిన్ని వార్తలు